- 2,089 అప్లికేషన్లలో 22.88 శాతం తిరస్కరణ
- సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 2024-25 రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, హోం శాఖ (ఎంహెచ్ఏ), ఆర్థిక శాఖ వంటి ప్రధాన పబ్లిక్ అథారిటీలు ఆర్టీఐ ధరఖాస్తులను అత్యధికంగా రిజెక్ట్ చేశాయి. జాతీయ భద్రత, సార్వభౌమత్వం, వ్యక్తిగత సమాచారం వంటి కారణాలతో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమని పేర్కొంటూ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8ని 28,924 సార్లు ప్రయోగించాయి.
ఆర్టీఐ ధరఖాస్తుల తిరస్కరణకు గురైన కారణాల్లో ఈ రీజన్లే దాదాపు 49.88 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) 2024---25 యాన్యూవల్ రిపోర్టును గురువారం రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఢిల్లీ హైకోర్టు 2,089 ఆర్టీఐ దరఖాస్తుల్లో 22.88% (అత్యధిక రేటు) రిజెక్ట్ చేసింది. సుప్రీం కోర్టు 5,017 దరఖాస్తుల్లో 13.73% (689) రిజెక్ట్ చేసింది.
హోం మంత్రిత్వ శాఖ 58,130 దరఖాస్తుల్లో 7,750 (13.33 శాతం) తిరస్కరించింది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖకు అత్యధికంగా 2,20,283 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 18,734 (8.50 శాతం) రిజెక్ట్ అయ్యాయి. ఇక న్యాయ శాఖ 10,134 దరఖాస్తుల్లో 7.14% తిరస్కరించగా.. ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ 7.98% రిజెక్ట్ చేసింది. మొత్తంగా, రిజెక్షన్లలో సుమారు 49.88% ఒక్క సెక్షన్ 8(1)(జే) కిందే ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది.
