- లిక్కర్ స్కామ్ కేసులో 16న విచారణకు రావాలంటూ ఢిల్లీ మాజీ సీఎం
- కేజ్రీవాల్‌సహా 23 మందికి సమాచారం
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కేసులో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. వీరిలో సౌత్ గ్రూపునకు చెందిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
సీబీఐ దర్యాప్తు చేసిన లిక్కర్ కేసులో నిందితుల పాత్ర ఉందనేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసును ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితులైన 23 మందికి తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం. బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి వచ్చిన అధికారులు ఆమె అనారోగ్యంతో ఉండడంతో ఆమె భర్త అనిల్‌కు నోటీసులు అందజేసి వెళ్లారు.
అధికారులకు సహకరిస్తా: కవిత
సీబీఐ నోటీసులపై ఎక్స్‌లో కవిత స్పందించారు. ‘‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను సైతం ఎంక్వైరీ చేయాలని చేసిన వ్యాఖ్యలు అందరి అవగాహనలో ఉన్నది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ నెల 16న ఉందన్న విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా తెలియజేశారు. ఈ విషయంపై మా లీగల్ టీమ్‌తో డిస్కస్ చేస్తున్నాం. అధికారులకు సహకరిస్తా” అని ఎక్స్‌లో కవిత పోస్ట్ చేశారు.
