ఢిల్లీ హోటళ్లలో ఒక్క రాత్రికి లక్ష పైనే.. ఏఐ సమిట్తో పెరిగిన డిమాండ్

ఢిల్లీ హోటళ్లలో  ఒక్క రాత్రికి లక్ష పైనే.. ఏఐ సమిట్తో  పెరిగిన డిమాండ్
  • ఫైవ్ స్టార్  హోటళ్లలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు 
  • ఇప్పటికే అన్ని హోటల్స్​లో బుకింగ్స్ క్లోజ్
  • ప్రపంచవ్యాప్తంగా సమిట్​కు 35 వేల రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ: ఇండియా ఏఐ సమిట్  నేపథ్యంలో ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 35 వేల దరఖాస్తులు వచ్చాయి. పలు దేశాల ప్రతినిధులు, స్పీకర్లు, టెక్నాలజీ లీడర్లు సమిట్ లో పాల్గొననున్నారు. దీంతో సిటీలోని హోటళ్లకు విపరీతమైన డిమాండ్  ఏర్పడింది. ఇదే అదనుగా ఫైవ్ స్టార్  హోటల్స్ తో పాటు అన్ని హోటళ్లు కూడా రేట్లను భారీగా పెంచేశాయి. సాధారణంగా ఒక రాత్రికి రూ.20 వేల నుంచి రూ.40 వేలు చార్జి చేసే హోటళ్లు వాటిని రూ.లక్షకు పెంచాయి. పలు ఫైవ్ స్టార్, లగ్జరీ హోటళ్లు అయితే వన్ నైట్ కు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల రేటు ఫిక్స్  చేశాయి. ఢిల్లీ ఎన్ సీఆర్  పరిధిలోని సగటు హోటళ్లలో ధరలు ఒక రాత్రికి రూ.లక్షకు చేరుకున్నాయని ట్రావెల్ వెబ్ సైట్లు తెలిపాయి. ‘‘ఇండియా ఏఐ సదస్సు ప్రభావం వల్ల ఢిల్లీలో హోటళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొన్ని ఫైవ్ స్టార్  హోటళ్లు హీనపక్షం రోజుకు రూ.లక్షపైనే చార్జి చేస్తున్నాయి. ద లీలా ప్యాలెస్, ఐటీసీ మౌర్య, తాజ్ ప్యాలెస్  వంటి లగ్జరీ హోటళ్లు భారీగా ధరలను పెంచేశాయి” అని ట్రావెల్  పోర్టల్ ఐగ్జిగో సీఈఓ అలోక్  బాజ్ పాయ్ ‘ఎక్స్’ లో తెలిపారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సు

ద ఇంపీరియల్, షాంగ్రిలా ఎరోస్, ద పార్క్  హోటల్ లో బుకింగ్స్  దాదాపు అయిపోయాయి. అలాగే కనౌత్ లోని ది ఇంపీరియల్  హోటల్​లో ఈ నెల 17న ఒక రాత్రికి రేటు రూ.2.4 లక్షలుగా, రాడిసన్ బ్లూలోనూ అదేరోజు రాత్రి రూ.1.1 లక్షలుగా ఉందని అలోక్  వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకూ ప్రపంచంలో జరిగిన నాలుగు గ్లోబల్  ఏఐ సమిట్​లలో ఇండియా ఏఐ సదస్సును అతిపెద్దదిగా భావిస్తున్నారు. వందకుపైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వారిలో 15 నుంచి 20 దేశాల అధినేతలు, 50కిపైగా మంత్రులు, 500 మంది ఇన్నొవేటర్లు, పరిశోధకులు, చీఫ్  టెక్నాలజీ ఆఫీసర్లు ఉన్నారు.