కాలుష్యంతో తల్ల-ఢిల్లీ.. దీపావళి తర్వాత రెడ్ జోన్లోకి ఢిల్లీ వాసులు

కాలుష్యంతో తల్ల-ఢిల్లీ.. దీపావళి తర్వాత రెడ్ జోన్లోకి ఢిల్లీ వాసులు
  • భారీగా పటాకులు కాల్చడంతో పెరిగిన గాలి కాలుష్యం
  • కండ్లలో మంట.. శ్వాసలో ఇబ్బందులు
  • ఎయిర్ క్వాలిటీలో ‘వెరీ పూర్’ కేటగిరీ
  • 359గా నమోదైన ఏక్యూఐ.. బవనాలో అత్యధికంగా 432
  • సుప్రీంకోర్టు నిబంధనలు బేఖాతరు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి కారణంగా సోమవారం రాత్రంతా పటాకులు కాల్చడంతో ‘రెడ్​జోన్’​లోకి వెళ్లింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​లో ‘వెరీ పూర్’ కేటగిరి కింద 359 రీడింగ్ నమోదైంది. ఢిల్లీ సిటీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లు ఉంటే.. వాటిలో 35 స్టేషన్లు ‘రెడ్ జోన్’ ఇండికేటర్​ను చూపించాయి. 

ఎయిర్ క్వాలిటీతో పాటు విజిలిటీ దారుణంగా పడిపోయింది. దీపావళి రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. ఢిల్లీవాసులు పట్టించుకోలేదు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పటాకులు కాల్చారు. 

దీనికితోడు పక్కనే హర్యానా, పంజాబ్ రైతులు వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఢిల్లీ–ఎన్​సీఆర్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా మంది ఢిల్లీ వాసులు గొంతు నొప్పి, కండ్లల్లో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. కొన్ని రోజుల పాటు అందరూ మాస్క్​లు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పంజాబ్, హర్యానాలోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. కాగా, సుప్రీం కోర్టు నిబంధనలను అమలు చేయడంలో ఢిల్లీ గవర్నమెంట్ విఫలమైందని ఆప్ ఆరోపిస్తుంటే.. పంజాబ్ కారణంగానే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ విమర్శిస్తున్నది. 

ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఎవరూ ఇండ్లలోంచి బయటికి రావొద్దని, బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) హెచ్చరించింది.

వెరీ పూర్ కేటగిరి నుంచి రెడ్ జోన్​లోకి..

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అధికారులు ప్రకటించారు. బవనాలో 432, జహంగీర్​పురిలో 409, వజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 408, బురారిలో 405గా రికార్డయింది. సోమవారం సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. పటాకులు కాల్చడంతో రాత్రికి రాత్రే ఢిల్లీ మొత్తం రెడ్ జోన్​లోకి వెళ్లిపోయింది. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి అనుమతి రాగానే ఈ వారంలో క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించేందుకు సిద్ధమవుతున్నది. దీపావళి తర్వాత ఫస్ట్ ట్రయల్ చేస్తామని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఫైర్ స్టేషన్లకు 269 ఎమర్జెన్సీ కాల్స్

దీపావళి సందర్భంగా ఢిల్లీలో పలుచోట్ల మైనర్ ఫైర్ యాక్సిడెంట్లు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం పొద్దున వరకు 269 కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధికారులు తెలిపారు. నిరుడుతో పోలిస్తే కాల్స్ 15 శాతం (315 కాల్స్) తగ్గినట్లు వివరించారు.  269 కాల్స్​లో.. 122 కాల్స్ ఫైర్ క్రాకర్స్​కి సంబంధించనవి ఉన్నాయి. 
ఫైర్ క్రాకర్స్, దీపాల కారణంగా చిన్న పాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.