- పోలీసుల బలప్రయోగం
- తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని వెల్లడి
- న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రతిజ్ఞ
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మా గొంతు వినిపించే వరకు వెనకడుగు వేయబోమని విద్యార్థులు, ఆందోళనకారులు తేల్చిచెప్పారు. ఢిల్లీలో సోమవారం పార్లమెంట్ మార్చ్ కు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కాగా, మంగళవారం వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మద్దతుదారులు తిరిగి జంతర్ మంతర్‌కు వచ్చారు.
మధ్యాహ్నం వరకు ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుల బలప్రయోగం తమ ఆందోళనను కొనసాగించాలనే సంకల్పాన్ని మరింత బలపరిచిందని పేర్కొన్నారు. సోమవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణ తమను నిరుత్సాహపరచలేకపోయిందని, పైగా మరింత మందిని ఈ ఉద్యమంలోకి చేర్చిందని చాలా మంది నిరసనకారులు తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
సోమవారం నాటి ఆందోళనలో పాల్గొన్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని సాక్షి చందా మాట్లాడుతూ.. పోలీసుల చర్య.. నిరసనను మరింత తీవ్రతరం చేసిందని పేర్కొన్నారు. ‘నిన్న మేము చూసిన పోలీసుల క్రూరత్వం మా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఎంతో మంది త్యాగాలతో ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది కాబట్టే మేము తిరిగి వచ్చాము. దీనిని మేము వృథాగా పోనివ్వం. మా గొంతు వినిపించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము’ అని ఆమె అన్నారు. అలాగే, చందా తల్లి మాట్లాడుతూ.. విద్యార్థులకు అండగా నిలబడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని అన్నారు.
