ప్రభుత్వ ఆస్పత్రులకు నకిలీ మందులు..ఢిల్లీలో సీబీఐ విచారణ!

ప్రభుత్వ ఆస్పత్రులకు నకిలీ మందులు..ఢిల్లీలో సీబీఐ విచారణ!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులకు నకిలీ మందుల సరఫరా ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ కు లెటర్ రాశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లక్షలాది మంది పేషెంట్లకు నకిలీ మందులు సరఫరా చేస్తున్నారని లేఖలో ఎల్జీ ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘ఈ మందులను ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్స్ లో పరిశీలించగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. వీటిని ఢిల్లీ హెల్త్ సర్వీసెస్ (డీహెచ్ఎస్) విభాగంలోని సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ ఏజెన్సీ కొనుగోలు చేసింది. ఆ మెడిసిన్స్ ను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేశారు. మొహల్లా క్లినిక్స్ కు కూడా పంపించి ఉండొచ్చు. పైగా ఈ మెడిసిన్స్ కోసం భారీగా బడ్జెట్ ఖర్చు చేశారు. 

ఇందులో డీహెచ్ఎస్, ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తయారీదారులు, సరఫరాదారులు, ఆయా స్టేట్స్ డ్రగ్ కంట్రోలర్ల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఇప్పటికే మొహల్లా క్లినిక్స్ కు సంబంధించిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఇప్పుడు ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలి” అని సీఎస్ కు ఎల్జీ సిఫారసు చేశారు. కాగా, ఢిల్లీలోని ఆస్పత్రులకు నకిలీ మందులు సరఫరా చేస్తున్నారని కొన్ని రోజుల కిందట ఫిర్యాదులు రాగా శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. అవి నకిలీ మందులేనని టెస్టుల్లో తేలింది. దీనిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ రిపోర్టు ఇచ్చింది.

హెల్త్ సెక్రటరీని సస్పెండ్ చేయండి: మంత్రి

‘నేను హెల్త్ మినిస్టర్​గా 3 మార్చి 2023న బాధ్యతలు తీసుకున్నాను. సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ ఏజెన్సీ కొనుగోలు చేసిన మందుల పై ఆడిట్ చేయాలని అదే నెల 21న ఆదేశాలు ఇచ్చాను. కానీ హెల్త్ సెక్రటరీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ జులై 24న అడిగినా స్పందించలేదు. హెల్త్ సెక్రటరీని తొలగించాలని 2 నెలల కింద ఎల్జీకి లెటర్ రాసినా ఆయన కూడా పట్టించుకోలేదు” అని హెల్త్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఢిల్లీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవా డిమాండ్ చేశారు.