అభిషేక్‌రావును ప్రశ్నిస్తున్న సీబీఐ

అభిషేక్‌రావును ప్రశ్నిస్తున్న సీబీఐ
  • హవాలా డబ్బుపైనా ఆరా
  • మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చే చాన్స్
  • వీరిలో ఒకరు ఓ మహిళా నేతకు అత్యంత సన్నిహితుడు?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ ఎక్సైజ్‌‌‌‌ పాలసీ స్కాం కేసులో సీబీఐ అధికారులు కీలక వివరాలు రాబడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌‌‌లో జరిగిన మీటింగ్స్‌‌‌‌లో ఎవరు పాల్గొన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్‌‌‌‌రావుతోపాటు సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అభిషేక్‌‌‌‌రావు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఓ మహిళా నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని విచారించనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించినట్లు సమాచారం. ఢిల్లీ రూస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్‌‌‌‌ కోర్టులో ఫైల్‌‌‌‌ చేసిన కస్టడీ పిటిషన్‌‌‌‌లో కీలక వివరాలను పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా రూ.3.80 కోట్లకు సంబంధించిన వివరాలను అభిషేక్‌‌‌‌రావు నుంచి రాబడుతున్నారు. దర్యాప్తులో భాగంగా అభిషేక్‌‌‌‌ రావు, సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు, విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌ బ్యాంక్ అకౌంట్స్ పరిశీలించారు.

ఎనిమిదిసార్లు విచారించినం
లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌‌‌లో అనేక సార్లు మీటింగ్స్ నిర్వహించినట్లు సీబీఐ అధికారులు కస్టడీ పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. హవాలా రూపంలో మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్స్ చేసినట్లు వివరించారు. 2021 నవంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ ఏడాది జులై వరకు ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు, విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, దినేశ్ అరోరాలతో కలిసి అభిషేక్ కుట్ర చేసినట్లు కోర్టుకు తెలిపారు. ‘‘అభిషేక్ రావుకు ముందుగానోటీసులు ఇచ్చాం. గత నెల 25, 28, 29వ తేదీలతో పాటు ఈ నెల 3, 6వ తేదీల్లో అతడు విచారణకు హాజరయ్యాడు. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో 41(ఏ) సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ కింద మరోసారి నోటీసులు ఇచ్చాం. 7, 8, 9వ తేదీల్లో మళ్లీ విచారించాం. అభిషేక్‌‌‌‌రావు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అరెస్ట్‌‌‌‌ చేశాం” అని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు, అభిషేక్‌‌‌‌రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేయనుంది. మనీట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ జరిగిన షెల్‌‌‌‌ కంపెనీల ఎండీలను మరోసారి విచారించనుంది. నేరానికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.