తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు విమర్శనా అస్త్రాలుగా మారుతున్నాయి. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కి తగ్గి, వెట్రివేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ వివాదం మరువకముందే తాజాగా సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ టాప్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా సీఎం సి. జోసెఫ్ విజయ్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. విజయ్ హీరోగా నటించిన ‘స్నేహితుడు’, ‘బీస్ట్’, ‘లియో’ చిత్రాలకు పనిచేసిన మనోజ్ పరమహంసకు ఈ పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సన్నిహితులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తుండగా, టీవీకే మద్దతుదారులు మాత్రం ఆయన ప్రతిభ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని సమర్థిస్తున్నారు.
ముఖ్యంగా సినీ రంగంలో విశేష అనుభవం, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్న వ్యక్తిగా మనోజ్ పరమహంసకు మంచి గుర్తింపు ఉంది. విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
MGR ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ విద్యార్థి:
మనోజ్ పరమహంసకు ఈ నియామకం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే, ఆయన చెన్నైలోని MGR ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లోనే సినిమాటోగ్రఫీ విద్యను అభ్యసించారు. అనంతరం సినిమాటోగ్రాఫర్ ఎస్. సరవణన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ ‘పమ్మల్ కె. సంబంధం’, ‘ప్రియమాన తోళి’, ‘మధురే’, ‘తిరుపాచి’, ‘తిరుపతి’ వంటి చిత్రాలకు సహకరించారు. ఆ తర్వాత 2009లో వచ్చిన ‘ఈరం’ సినిమాతో సోలో సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు.
Dear @actorvijay sir ,During the Leo shoot, after you presented medals to the 10th and 12th standard students, I mentioned that next year the students would study even harder just to receive medals from you. You responded by saying that it is not that easy and that it carries… pic.twitter.com/N7gVknxefs
— manoj paramahamsa (@manojdft) May 4, 2026
పాన్ ఇండియా భాషల్లో సక్సెస్ ఫుల్ జర్నీ..
మనోజ్ పరమహంస, తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తెలుగులో రేస్ గుర్రం, కిక్ 2, బ్రూస్ లీ, రాధే శ్యామ్, ప్రిన్స్, గుంటూరు కారం, హరి హర వీర మల్లు, ‘దే కాల్ హిమ్ ఓజీ’ వంటి చిత్రాలకు పనిచేశారు. నిర్మాతగానూ ‘పూవరసం పీపీ’, ‘సిల్లు కరుపట్టి’, ‘మిన్మిని’ చిత్రాలను నిర్మించారు.
