హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి బ్యాంక్ లాకర్స్ను ACB అధికారులు శనివారం ఓపెన్ చేశారు. నరహరి బ్యాంకు లాకర్లో 1.50కోట్లు నగదు లభ్యమైంది. శాలిబండ కెనరా బ్యాంకులో లాకర్లలో ఈ డబ్బును ఏసీబీ అధికారులు గుర్తించారు. మరో రెండు లాకర్లు తెరుస్తామంటున్న ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పటికే నరహరి ఇంట్లో కోటి 54 లక్ష రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. నరహరి బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయల నగదు ఫ్రీజ్ చేశారు.
ఆర్ అండ్‌బీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జరుపుల మోహన్‌నాయక్ తరహాలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ల్యాండ్ అండ్ సర్వే మల్టీజోన్2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావును ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాతబస్తీ ఛత్రినాకలోని ఆయన ఇల్లు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు సహా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నరహరి ఇంటి బెడ్‌రూమ్‌లోని బీరువా పైన కప్‌బోర్డులో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం దొరికింది. వీటితో పాటు బ్యాంక్ బ్యాలెన్స్‌రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్‌డిపాజిట్లు స్వాధీనం చేకున్నారు.
సైబరాబాద్‌లో బిల్డింగులు, ఆపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, భార్య పేరిట రెండు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న కుమారుడు, అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.180 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నరహరిని అరెస్ట్ చేసి.. ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా 14 రిమాండ్ విధించారు.
* ఛత్రినాకలో ఇల్లు, గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో బిల్డింగ్
* రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు
* మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి
* పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్(2,500 ఎస్‌ఎఫ్‌టీ)
* నార్సింగిలో రెండు హైరైజ్ బిల్డింగ్స్(ఒక్కోటి 1,860 ఎస్‌ఎఫ్‌టీ)
* రాజేంద్రనగర్‌లో రెసిడెన్షియల్ ఫ్లాట్
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ సర్వేయర్‌గా అవినీతి, అక్రమాలు
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఛత్రినాకకు చెందిన సుంకరి నరహరిరావు తండ్రి యాదవరావు నారాయణగూడలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్‌గా పనిచేసేవాడు. ఆయన 1984 డిసెంబర్‌లో మృతి చెందగా.. అప్పటికే ఇంటర్ చదువుతున్న నరహరిరావుకు 1987 సెప్టెంబర్‌లో ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్‌లో డిప్యూటీ సర్వేయర్‌గా పదోన్నతి లభించింది. నాటి నుంచి 2001 వరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నరహరిరావు పనిచేశాడు. అనంతరం 2008 వరకు హైదరాబాద్‌లో సర్వేయర్‌గా విధులు నిర్వహించాడు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీస్‌లో డిప్యూటీ ఇన్‌స్టెక్టర్‌గా, మహబూబ్‌నగర్, వరంగల్‌లో 2013 వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2016 నుంచి 2020 వరకు సర్వే అండ్ ల్యాంగ్ రికార్డ్స్‌లో విధులు నిర్వహించాడు. నిరుడు ఆగస్టులో మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సర్వేలకు సంబంధించి నరహరిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో భూముల అమ్మకాలకు సంబంధించిన సర్వేల సమయంలోను భారీగా అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఇందులో భాగంగా నరహరికి ఇటీవల పెద్ద మొత్తంలో నగదు చేరినట్టు ఏసీబీకి సమాచారం అందింది.
