ఢిల్లీ లిక్కర్ స్కామ్ ​కేసులో సీబీఐని ఆదేశించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ​కేసులో  సీబీఐని ఆదేశించిన కోర్టు
  • స్పష్టంగా ఉన్న కాపీలను అందించండి
  • వర్చువల్​గా హాజరైన కవిత

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్ షీట్​పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ లో పలు పేజీల మిస్సింగ్, ఖాళీలపై ప్రతివాదులు లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసి ఇవ్వాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

ఈ కేసు వ్యవహారంలో ఈ ఏడాది జూన్ 7న కవితతోపాటు, మరో నలుగురిపై సీబీఐ సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్​ను జూలై 22న కోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే అంతకు ముందు మనీష్ సిసోడియా, అమన్ డీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రుపై సీబీఐ అదనపు ఛార్జ్ షీట్ వేసింది. ఈ ఛార్జ్ షీట్లపై గురువారం మరోసారి సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు.

Also Read:-డిగ్రీని రెండేండ్లలోనే పూర్తి చేయొచ్చు...స్టూడెంట్లకు వెసులుబాటు కల్పించనున్న యూజీసీ

 ఈ సందర్భంగా కవితతోపాటు ఈ కేసులోని సహ నిందితులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరయ్యారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా లేని పలు పేజీల విషయాన్ని నిందితుల తరఫు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో కోరినప్పటికీ దర్యాప్తు సంస్థలు మరోసారి పాత కాపీలే ఇచ్చాయని నివేదించారు. ఇందులో చాలా పేజీల్లో అక్షరాలు నల్లగా, స్పష్టంగా లేవని, ఖాళీలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇందుకు సీబీఐ స్పందిస్తూ... మరోసారి అప్ డేట్ చేసిన కాపీలు అందజేస్తామని కోర్టుకు తెలిపింది.