- ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యా సంస్థలతో ఎంఎస్‌డీసీఏ ఒప్పందం
- తొలి దశలో హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల అకాడమీల ఏర్పాటు
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం), పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, ఎంఎస్‌డీసీఏ ఎండీ మిహిర్ దివాకర్ ఎంవోయూపై సంతకాలు చేశారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రెండేళ్ల కాల పరిమితితో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎంఎస్‌డీసీఏ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కొమరయ్యను అభినందించారు. హైదరాబాద్‌లో దిగ్గజ క్రికెటర్ ధోనీకి చెందిన క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. మన దగ్గర ఈ అకాడమీ ఉన్నత ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
తొలి దశలో హైదరాబాద్‌లో నాలుగు చోట్ల..
క్రికెటర్ కావాలనే ఆశయమున్న పిల్లలు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించాలన్న లక్ష్యంతోనే ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్, దాని చుట్టు పక్కల పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. తొలిదశలో భాగంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ నెలాఖరు నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, వచ్చే నెలలో నాదర్‌గుల్‌లోని డీపీఎస్, గండిపేట, బోడుప్పల్‌లలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో అకాడమీలు తెరవబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ అకాడమీలు తెరిచే ఆలోచన ఉందని మిహిత్ తెలిపారు. ఎంఎస్‌డీసీఏ కోచింగ్ మాడ్యూల్‌ను ధోనీ సూచనలు మేరకు ఎప్పటికప్పుడు మోడ్రనైజ్ చేస్తుంటామని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని, అలాంటి వాళ్లను ప్రణాళికబద్దమైన శిక్షణతో మంచి స్థాయికి చేర్చడమే తమ అకాడమీ లక్ష్యమని చెప్పారు.
చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యం.
చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల అభిరుచికి సముచిత స్థానమివ్వాలనేది తమ విద్యాసంస్థల ప్రథమ లక్ష్యమని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ ప్లేయర్లు సుమిత్ -సిక్కి రెడ్డి, రోలర్ స్కేటింగ్‌లో అనూప్ యమ, షూటింగ్‌లో గగన్ నారంగ్ తమ విద్యాసంస్థల్లో ఇప్పటికే అకాడమీలను నడుపుతున్నారని తెలిపారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో తమ విద్యాసంస్థలో క్రికెట్ అకాడమీలనూ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)తో ఒప్పందం చేసుకున్నామని కొమరయ్య వెల్లడించారు.

