హిందూపురం కోసం ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికీ సిద్ధమే

హిందూపురం కోసం ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికీ సిద్ధమే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దారి తీసింది. కొన్ని చోట్ల జిల్లాల పేర్ల మార్పు కోసం, మరి కొన్ని చోట్ల తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాలో కాకుండా పాత జిల్లాల ఉంచాలన్న డిమాండ్‌తో, ఇంకొన్ని చోట్ల జిల్లా కేంద్రం మార్పు కోసం నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని కొత్త గా శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించిన జగన్ సర్కారు.. జిల్లా కేంద్రంగా మాత్రం హిందూపురం కాకుండా పుట్టపర్తిని ప్రకటించింది. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ మౌన దీక్ష చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిందూపురంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మౌన దీక్ష ముగించిన తర్వాత ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలి

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హడావిడిగా ప్రభుత్వం జిల్లాల ప్రకటన చేసిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉంటానని, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్‌తో రాజీనామా చేసేందుకు కూడా రెడీ అని  ప్రకటించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రటించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.

విజయవాడకు ఎన్టీఆర్‌‌ జిల్లా పేరు పెట్టడంపైనా బాలయ్య స్పందన

హిందూపురంలో ఆందోళనల సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టడంపైనా స్పందించారు. ఎన్టీఆర్‌‌ అంటే రాష్ట్రం మొత్తం అందరికీ అభిమానమేనని, ఆయన పేరుతో జిల్లా ప్రకటించడం సంతోషమేనని అన్నారు. అయితే నిజంగా అభిమానాన్ని చూపాలనుకుంటే సీఎం జగన్ చేయాల్సింది ఇలాంటివి కాదని, ఆయన ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సూచించారు. అన్న క్యాంటీన్ల రద్దుతో పేదవాడి నోటి దగ్గర ముద్ద లాగేసుకుని, ఎంగిలి చేతిని విదిలిస్తున్నారని, జగన్‌కు దమ్ముంటే అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించి ఎన్టీఆర్‌‌పై తన అభిమానాన్ని చాటుకోవాలని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

యూపీలో కాల్పుల ఎఫెక్ట్.. ఒవైసీకి భద్రత పెంచిన మోడీ సర్కారు

మేకిన్ ఇండియా కాదు.. బై ఫ్రమ్ చైనా

నాకు భయంతో చలి జ్వరం వచ్చింది