ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి భద్రత పెంపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి  భద్రత పెంపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరగడంతో ఆయనకు జడ్ కేటగిరి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా  ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒవైసీ క్షేమంగా బయటపడ్డారు.  ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అధికారులు అసదుద్దీద్ భద్రత దృష్ట్యా ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ సెక్యూరిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు నోయిడా నివాసి సచిన్‌పై గతంలో హత్యాయత్నం కేసు ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఒవైసీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై దుండగులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో ఢిల్లీకి   బయలుదేరి వెళ్లారు  అసదుద్దీన్ ఒవైసీ. టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు కనిపించిందని, దుండగులు మొత్తం నలుగురు ఉన్నారని, కాల్పుల ఘటన వల్ల తన కారు పంక్చర్ కావడంతో వేరే వాహనంలో ఢిల్లీకి వెళ్లినట్లు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.