సౌండ్ పొల్యూషన్ చేస్తే లక్ష ఫైన్ కట్టాల్సిందేనట!

సౌండ్ పొల్యూషన్ చేస్తే లక్ష ఫైన్ కట్టాల్సిందేనట!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకీ శబ్ద కాలుష్యం పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ భావించింది. ఈ దిశగా కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పండుగలు, వేడుకలు, సమావేశాలు, ఉత్సవాల్లో నిబంధనలను ఉల్లంఘించి శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌండ్ పొల్యూషన్‌కు సంబంధించి విధించే జరిమానా మొత్తాల్ని సవరిస్తూ కాలుష్య నియంత్రణ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది.

తాజా రూల్స్ ప్రకారం.. ఇకపై ఢిల్లీలో నిర్దేశిత సమయం తర్వాత టపాసులు పేలిస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి. సైలెంట్ జోన్‌లో ఈ రూల్‌ను అతిక్రమిస్తే రూ.3 వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇళ్లు, పెళ్లి వేడుకలు, పబ్లిక్ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాల్లో బాణసంచా నిబంధనలను తొలిసారి ఉల్లంఘిస్తే రూ.10 వేలు, సైలెంట్ జోన్‌లో అయితే రూ.20 వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రెండోసారి రూల్స్ ఉల్లంఘిస్తే రూ.40 వేలు, అంతకంటే ఎక్కువసార్లు అతిక్రమిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. అంతేకాదు ఆ ప్రాంతాన్ని సీల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ.10 వేలు ఫైన్ వేస్తామని పేర్కొంది. 1,000 కేవీఏ డీజిల్ జనరేటర్ సెట్లను ఉపయోగిస్తే లక్ష రూపాయలు ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది. భారీ శబ్దాలు చేసే స్పీకర్లు, జనరేటర్ల లాంటి వస్తువులను ఉపయోగిస్తే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.