వడగండ్ల వానకు విమానం ధ్వంసం

వడగండ్ల వానకు విమానం ధ్వంసం

వాషింగ్టన్‌‌: ఇటలీలోని మిలాన్‌‌ నుంచి న్యూయార్క్‌‌కు బయలుదేరిన విమానం టేకాఫ్‌‌ అయిన గంటకే అత్యవసరంగా ల్యాండింగ్‌‌ అయింది. డెల్టా ఎయిర్‌‌‌‌లైన్స్‌‌కు చెందిన విమానం 215 మంది ప్రయాణికులతో సోమవారం మిలాన్‌‌ నుంచి న్యూయార్క్‌‌లోని జేకేఎఫ్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు బయలుదేరింది. బయలుదేరిన 15 నిమిషాలకే ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన స్టార్ట్ అయ్యింది. భారీ సంఖ్యలో పెద్దపెద్ద వడగండ్లు విమానంపై పడ్డాయి. 

దీంతో ఫ్లైట్‌‌ ముందుభాగం, రెక్కలు, ఇంజిన్లు, రాడోమ్‌‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పైలట్లు విమానాన్ని వెంటనే రోమ్‌‌కు మళ్లించి, అత్యవసర ల్యాండింగ్‌‌ చేశారు. ఫ్లైట్‌‌ బయలుదేరిన 65 నిమిషాల తర్వాత సురక్షితంగా రోమ్‌‌లో ల్యాండ్‌‌ కావడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. విమానంలో 215 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు పైలట్లు, 8 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ఎక్కిన కొద్దిసేపటికే రోలర్‌‌‌‌ కోస్ట్‌‌ ఎక్కినట్లు అనిపించిందని, భారీ కుదుపులు వచ్చాయని పలువురు ప్రయాణికులు తెలిపారు.