ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది : రాహుల్ గాంధీ

ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది : రాహుల్ గాంధీ
  • ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి
  • కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్ కామెంట్​
  • నాతోపాటు  ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు   
  • న్యాయవ్యవస్థను, మీడియాను  కంట్రోల్ చేస్తున్నరని ఆరోపణ

లండన్/న్యూఢిల్లీ:    ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతోపాటు అనేక మంది ప్రతిపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘నా ఫోన్ లో పెగాసస్ స్పైవేర్ ఉంది. ఇంకా అనేక మంది నాయకుల ఫోన్ లలోనూ ఇది ఉంది. ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నన్ను హెచ్చరించారు కూడా. మేం నిరంతరం ఈ ప్రెజర్ ను ఫీల్ అవుతూనే ఉన్నాం” అని ఆయన అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ మంగళవారం సాయంత్రం కేంబ్రిడ్జి యూనివర్సిటీ జడ్జ్ బిజినెస్ స్కూల్ లో ‘21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం (లర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ)’ అంశంపై మాట్లాడారు. ఈ స్పీచ్ కు సంబంధించిన వీడియో లింక్ ను కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ట్విట్టర్ లో శుక్రవారం పోస్ట్ చేశారు. కేంబ్రిడ్జిలో రాహుల్ మాట్లాడుతూ.. ఇండియాలో మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారని, నాయకులపై నిఘా పెడుతున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, మైనారిటీలపై, దళితులపై, ట్రైబల్స్ పై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్యానికి పార్లమెంట్, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ కీలకమని, కానీ ఇండియాలో వీటిపైనే దాడి జరుగుతోందన్నారు. కనీసం పార్లమెంట్ ముందు ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు. తాను, ఇతర ఎంపీలు ఏదో ఒక విషయంపై మాట్లాడేందుకు నిలబడితే అరెస్ట్ చేసి, జైలులో పెట్టారన్నారు.  

కాశ్మీర్ లో టెర్రరిస్టులను చూశా 

భారత్ జోడో యాత్ర జ్ఞాపకాలను కూడా రాహుల్ గుర్తు చేసుకున్నారు. టెర్రరిస్ట్ దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున కాశ్మీర్ లో జోడో యాత్ర చేపట్టొద్దని భద్రతా సిబ్బంది హెచ్చరించినా, తాను యాత్రను కొనసాగించానని చెప్పారు. ‘‘కాశ్మీర్ లో యాత్ర సందర్భంగా ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. కొద్దిదూరంలో నిలబడి ఉన్న కొంతమందిని చూపుతూ వారు టెర్రరిస్టులని చెప్పాడు. నేను వాళ్లను చూశా. ప్రమాదంలో పడ్డానని అనుకున్నా. కానీ ఏమీ జరగలేదు. ప్రజల సమస్యలను వినేందుకు వచ్చినందుకే వారు నన్ను ఏమీ చేయలేదు” అని రాహుల్ అన్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య భిన్నమైన సిద్ధాంతాలపైనా రాహుల్ మాట్లాడారు. చైనాలో ప్రొడక్షన్ పెద్ద ఎత్తున పెరగగా, ఇండియా, అమెరికాలో బాగా తగ్గిందన్నారు. ‘‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సామరస్య సిద్ధాంతాన్ని పాటిస్తోంది. ఆ దేశం ఖనిజ వనరులు, జలాలు, అవకాశాల కోసం చూస్తుంది. వాటికి ఒక రూపును ఇస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివే ఇందుకు మంచి ఉదాహరణ” అని రాహుల్ అభిప్రాయపడ్డారు. 

రాహుల్.. నీ ఫోన్ ఎందుకియ్యలే: అనురాగ్ ఠాకూర్  

పెగాసస్ స్పైవేర్ తో నిఘా పెట్టారని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి తమ ఫోన్ లను ఎందుకివ్వలేదని, వాళ్లు ఏం దాచాలని అనుకున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘‘ప్రధాని మోడీ పట్ల రాహుల్ కు ఉన్న ద్వేషాన్ని మేం అర్థం చేసుకోగలం. కానీ విదేశీ గడ్డపై ఫారిన్ ఫ్రెండ్స్ తో కలిసి ఇండియాపై బురద జల్లడం చూస్తుంటే కాంగ్రెస్ ఎజెండాపైనే సందేహాలు వస్తున్నాయి” అని ఠాకూర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ మరోసారి ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ విదేశీ గడ్డపై నుంచి ఇండియాపై బురదజల్లే అవకాశాన్ని మాత్రం ఆ పార్టీ ఎన్నడూ వదులుకోదని అర్థమైంది” అని విమర్శించారు. ప్రధాని మోడీని, ఇండియాను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మెచ్చుకున్నారని, కనీసం ఆమె మాటలనైనా రాహుల్ వినాల్సిందన్నారు.