డెంటల్ డాక్టర్లు ​స్కిన్ ట్రీట్మెంట్​ చేస్తున్నరు.. 95 శాతం మంది అలాంటోళ్లే: డాక్టర్ రజిత

డెంటల్ డాక్టర్లు ​స్కిన్ ట్రీట్మెంట్​ చేస్తున్నరు.. 95 శాతం మంది అలాంటోళ్లే: డాక్టర్ రజిత

హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హత, అనుభవం లేకుండానే స్కిన్ ట్రీట్​మెంట్ చేసేవాళ్ల సంఖ్య తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పెరిపోతున్నదని యాంటీ క్వాకరీ, లీగల్, ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ రజిత అన్నారు. డెర్మటాలజీ స్పెషలిస్టులందరూ కలిసి నాలుగేండ్లుగా అలాంటి వారిపై పోరాటం చేస్తున్నామన్నారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‘‘గత నాలుగేండ్లలో రాష్ట్రంలో 85, ఇతర రాష్ట్రాల్లో 312 క్లినిక్​లలో అర్హత లేకుండానే చర్మ వ్యాధులకు ట్రీట్​మెంట్ ఇస్తున్నట్లు సర్వే ద్వారా గుర్తించాం. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశాం. నామమాత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు’’అని ఆరోపించారు.

90 శాతం మంది బీడీఎస్​ చేసిన వారే..
చర్మ వ్యాధులకు ట్రీట్​మెంట్ చేస్తున్న వారిలో దాదాపు 90 శాతం మంది బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్​సర్జన్) చేసిన వాళ్లే ఉన్నారని డాక్టర్ రజిత ఆరోపించారు. ‘‘బీడీఎస్ కోర్సులు చేసి డెర్మాటలజీ స్పెషలిస్టులుగా అవతారం ఎత్తుతున్నారు. అయినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. అవగాహన లేకుండా ట్రీట్​మెంట్ చేయడంతో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాళ్ల కారణంగా మాకు చెడ్డ పేరు వస్తున్నది. డెంటల్ డాక్టర్లతో పాటు కొన్ని చోట్ల బ్యుటీషియన్లు కూడా వారి పరిధి దాటుతున్నరు” అని చెప్పారు.