ప్రైవేట్ బడుల్లో ప్రొఫెషనల్ ట్యాక్స్..టీచర్ల శాలరీల నుంచి ముందే కట్ చేయాలి : నవీన్ నికోలస్

ప్రైవేట్ బడుల్లో ప్రొఫెషనల్ ట్యాక్స్..టీచర్ల శాలరీల నుంచి ముందే కట్ చేయాలి : నవీన్ నికోలస్
  • నిర్లక్ష్యం చేస్తే డీఈవోలపై చర్యలు
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలుపై విద్యాశాఖ సీరియస్ అయింది. 1987 వృత్తి పన్ను చట్టం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఉద్యోగి నుంచి ఈ పన్ను వసూలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు చెల్లించే ముందే ట్యాక్స్‌‌‌‌ను కట్ చేయాలని, ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యత డీఈవోలదేనని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.

తమ జిల్లా పరిధిలోని ప్రైవేట్ బడుల్లో వృత్తి పన్ను అమలయ్యేలా చూడాలన్నారు. గతంలో జారీ చేసిన జీవో 610, 497ల ప్రకారం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి వృత్తి పన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ట్యాక్స్ వసూలు చేయడంలో విఫలమైతే, దానిని విధి నిర్వహణలో వైఫల్యంగా పరిగణిస్తామని, నిబంధనలు పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు.