టిబెట్ ఎయిర్ బేస్​లో డ్రోన్స్, ఫైటర్ జెట్స్ మోహరింపు

టిబెట్ ఎయిర్ బేస్​లో డ్రోన్స్, ఫైటర్ జెట్స్ మోహరింపు
  • లాసా వైమానిక స్థావరంలో రన్​ వే నిర్మించిన డ్రాగన్​ కంట్రీ
  • చైనా వద్ద ‘‘సోరింగ్ డ్రాగన్” డ్రోన్లు​
  • మాక్సర్ టెక్నాలజీ శాటిలైట్ ఫొటోలతో వెలుగులోకి..

న్యూఢిల్లీ: అరుణాచల్​ ప్రదేశ్​లోని తవాంగ్ సెక్టార్​లో ఘర్షణ తర్వాత చైనా ఆర్మీ టిబెట్ ఎయిర్​ బేస్​లో అత్యాధునిక డ్రోన్లు, ఫైటర్​ జెట్​లను మోహరించింది. మాక్సర్ టెక్నాలజీ శాటిలైట్ ఫొటోలతో ఈ విషయం బయటపడింది. మన నార్త్​ఈస్ట్​ను లక్ష్యంగా చేసుకుని ఈ సామగ్రిని బార్డర్​కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అలర్ట్ అయిన ఇండియన్​ ఆర్మీ.. సరిహద్దు వెంట పెట్రోలింగ్ పెంచింది. అరుణాచల్ బార్డర్​కు ఈశాన్యంగా 150 కి.మీ దూరంలో ఉన్న బ్యాంగ్డా ఎయిర్​బేస్​లో అత్యాధునిక డబ్ల్యూజెడ్​–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్లను చైనా మోహరించింది. ఈ డ్రోన్.. నాన్​స్టాప్​గా 10 గంటలు ఎగురుతుంది. నిఘా మిషన్ల కోసం దీన్ని తయారు చేశారు. క్రూయిజ్​ మిసైల్స్​ను పడగొట్టేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుంది. మన దగ్గర ఇలాంటి డ్రోన్లు లేవు.

సరిహద్దు వద్ద చైనా ఎయిర్​బేస్​ల డెవలప్​

బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి చైనా తన ఎయిర్​బేస్​లను డెవలప్ చేసుకుంటూ వస్తున్నది. యుద్ధ విమానాలు, ట్రాన్స్​పోర్ట్, డ్రోన్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, నిఘా సంబంధిత డివైజ్​తో పాటు ఏవియేషన్ సామగ్రిని అప్‌గ్రేడ్ చేస్తున్నది. టిబెట్​లో హెలీపోర్ట్స్​, గ్రౌండ్​ బేస్డ్​ ఎయిర్​ డిఫెన్స్​తో పాటు రైలు మార్గాన్ని డెవలప్ చేసుకుంటున్నది.  మానవ రహిత వైమానిక వాహనాలు, ఎయిర్​ ఫీల్డ్​ కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలో తవాంగ్​ సెక్టార్​లో ఇండియన్​ ఆర్మీతో డిసెంబర్ 9న ఘర్షణకు దిగింది. అరుణాచల్​లోని యాంగ్ట్సేను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని ఇండియా తిప్పికొట్టింది. 

కీలక స్థావరాల నుంచి మన విమానాలు..

అరుణాచల్ మీదుగా మన గగనతలంలోకి చైనా విమానాలు ప్రవేశించే చాన్స్ ఉందని గుర్తించిన తర్వాత, ఐఏఎఫ్​ 2 సందర్భాల్లో యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. తేజ్​పూర్, మిస్సమారి, జోర్హాట్, హసిమారా, బాగ్డోగ్రాలతో పాటు అసోం, బెంగాల్​ మైదానాల్లోని ఎయిర్​బేస్​లను మనదేశం కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించుకుంటోంది. ఈ బేస్​ల నుంచి పనిచేసే మన యుద్ధ విమానాలు చైనీస్​ ఫైటర్​ జెట్స్​ కంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. టిబెట్ ఎత్తులో ఉండడంతో చైనా విమానాలు టేకాఫ్​ టైంలో ఎక్కువ బరువు మోయలేవు. కానీ, మన​ ఫైటర్​ జెట్స్​ మిసైల్స్, బాంబులు, ఇంధన ట్యాంకులతో ఈజీగా టేకాఫ్​ చేయగలవు.

బాంగ్డా ఎయిర్​బేస్​లో ఫ్లాంకర్​ టైప్​ జెట్ ​ఫైటర్స్​

డిసెంబర్​ 14న తీసిన ఫొటోల్లో బాంగ్డా ఎయిర్​బేస్​లో 2 ఫ్లాంకర్​ టైప్​ ఫైటర్​ జెట్​లు కనిపిస్తున్నాయి. సేమ్​ ఇలాంటి ఫైటర్​ జెట్లు మన వద్ద కూడా ఉన్నాయి. రష్యా డిజైన్ చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లను మన ఎయిర్​ఫోర్స్ ఆపరేట్ చేస్తోంది. మూడు కీలక ఎయిర్​ బేస్​ల ఫొటోలను మాక్సర్​ విడుదల చేసింది. బాంగ్డా (అరుణాచల్​ బార్డర్​ నుంచి 150 కి.మి.), లాసా (బార్డర్​ నుంచి 260 కి.మి.)  షిగట్సే (సిక్కిం బార్డర్​కు 150 కి.మి.) ఈ ఎయిర్​ బేస్​లు ఉన్నాయి. లాసా ఎయిర్​బేస్​లో రెండో రన్​వే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నవంబర్​ 24న తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.