- 1.30 లక్షల స్టూడెంట్లకు రూ. 450 కోట్ల స్కాలర్‌షిప్‌లు
- బీసీ సంక్షేమ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ
హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే (డీబీటీ) జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటివరకు 1 లక్షా 30 వేల మందికి రూ.450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల కచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ నిర్వహించారు. గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన 'కాటమయ్య రక్షణ కవచాలు' పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ పథకానికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉన్నతి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించి అర్హులైన వారిని జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
గురుకుల విద్యాలయాలకు స్వంత భవనాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం జ్ఞప్తి చేయగా, పరిశీలిస్తామని భట్టి తెలిపారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 180 మందికి రూ.18 కోట్ల 40 లక్షలు విడుదల చేశామని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
