రైతులకు గుడ్ న్యూస్: పల్లెల్లో ‘శాశ్వత’ పనులు.. కోల్డ్ స్టోరేజీలు, గోదాములు..

రైతులకు గుడ్ న్యూస్: పల్లెల్లో ‘శాశ్వత’ పనులు..  కోల్డ్ స్టోరేజీలు, గోదాములు..
  • మహిళలకు షీ-మార్ట్‌‌లు, నూనె  గానుగలు, ప్రాసెసింగ్ యూనిట్లు 
  • స్వయం సహాయక సంఘాలు, రైతులను భాగస్వామ్యం చేస్తూ కేంద్రం గైడ్​లైన్స్
  • వికసిత్ భారత్–గ్యారెంటీ మిషన్  కింద 375 పనుల జాబితా ఖరారు 

హైదరాబాద్, వెలుగు:వికసిత్​ భారత్– గ్యారెంటీ మిషన్(వీబీ జీ రామ్​ జీ) కింద గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి కేంద్రం పెద్దపీట వేస్తున్నది. ఇందులోభాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 375 రకాల పనులతో కూడిన సరికొత్త జాబితా రిలీజ్​ చేసింది.  

గతంలో చెరువుల్లో పూడికతీత, మట్టి పనులకే అధిక ప్రాధాన్యమివ్వగా, తాజా జాబితాలో గ్రామాల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేసింది.  రైతుల కోసం అత్యాధునిక కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. మహిళల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు, నూనె గానుగలు, షీ-మార్ట్‌‌లను ఏర్పాటు చేయబోతున్నారు. 

మొత్తం నాలుగు భాగాలుగా విభజించిన ఈ పనుల ద్వారా గ్రామీణులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడంతోపాటు శాశ్వత ప్రాతిపదికన గ్రామీణ ఆస్తుల కల్పన, మహిళా గ్రూపుల వ్యాపారాభివృద్ధి, రైతులకు మార్కెటింగ్ వసతులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి.

రైతులు, మహిళా సంఘాలకు చేయూత

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్  స్టోరేజీలతో పాటు గిడ్డంగుల నిర్మించేలా కార్యాచరణ రెడీ చేశారు. 

కమ్యూనిటీ అవసరాల కోసం ఆహార ధాన్యాల నిల్వ భవనాలు, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. పంట నూర్పిడి, ఆరబెట్టడం కోసం ఎత్తైన వ్యవసాయ ప్లాట్‌‌ఫారమ్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు వాణిజ్య పంటలు, కూరగాయలు పండించేందుకు వీలుగా వ్యక్తిగత, కమ్యూనిటీ పాలీ-హౌస్‌‌ల నిర్మాణానికి అవకాశం కల్పించారు.  

వర్మీ కంపోస్ట్, నాడెప్ యూనిట్లు, బర్కిలీ కంపోస్ట్  పిట్లను నిర్మించుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చేయూత అందించనున్నారు. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్  చేసుకునేందుకు ప్రత్యేకంగా షీ-మార్ట్  బిల్డింగ్​లు నిర్మించనున్నారు.

 నూనె గింజల ప్రాసెసింగ్ యూనిట్లు, మినీ పిండి మిల్లులు, జీడిపప్పు ప్రాసెసింగ్  ప్లాంట్లు, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పర్యావరణహిత విస్తరాకుల తయారీ యూనిట్లు, చేనేత మగ్గాలు, వెదురు కళాకృతుల యూనిట్లు, మహిళా సమాఖ్యల సమావేశాలు, కార్యకలాపాల కోసం గ్రామాల్లో ఎస్‌‌హెచ్‌‌జీ భవనాలు, క్లస్టర్  లెవల్  ఫెడరేషన్  బిల్డింగ్​లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. మహిళలకు అదనపు ఆదాయం కోసం మష్రూమ్  కల్టివేషన్  షెడ్లు నిర్మించనున్నారు. 

డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్  హబ్‌‌లుగా గ్రామాలు

వ్యవసాయ అనుబంధరంగాలకు ఊతమిచ్చేలా ప్రత్యేక మౌలిక వసతులు కల్పిస్తున్నారు. గ్రామాల్లో పాడి రైతుల కోసం పాల సేకరణ, నిల్వ కేంద్రాలు, పశువుల కోసంగోశాలలు, గొర్రెలు, మేకల షెడ్లు, పందుల షెడ్లు, కోళ్ల ఫారాలు నిర్మించుకోవచ్చు. 

గ్రామాల్లో చేపల చెరువులు, చేపలు ఎండబెట్టే యార్డులు, రొయ్యలు, పీతలు అవసరమైన ఆక్వాకల్చర్ కు మౌలిక వసతులు కల్పించనున్నారు. పట్టు పురుగుల పెంపకానికి ప్రత్యేక షెడ్లు, మల్బరీ, పట్టు పురుగు చెట్ల ప్లాంటేషన్  చేపట్టనున్నారు. 

జల సంరక్షణకు ప్రాధాన్యం

నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు కాలువలు, చెరువుల పునరుద్ధరణను విస్తృతం చేశారు. ప్రధాన, బ్రాంచ్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ నిర్మాణం, రిపేర్లు, ఫీల్డ్  చానల్స్  నిర్మాణం, చెక్ డ్యామ్‌‌లు, గల్లీ ప్లగ్స్, అండర్‌‌గ్రౌండ్  డైక్స్, ఎండిపోయిన, పని చేయని బోరుబావుల్లో ఫిల్టరేషన్  ఛాంబర్లు, రీచార్జ్  షాఫ్ట్‌‌లు, ఇంజెక్షన్  బావులు, ప్రభుత్వ భవనాలు, వ్యక్తిగత ఇళ్లపై  వర్షపు నీటి నిల్వ కోసం అవసరమైన పనులు చేపట్టనున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్  ఇరిగేషన్  పనులకు సహకారం 
అందించనున్నారు. 

పల్లెల్లో ఆధునిక వసతులు

గ్రామాల్లో ఆధునిక వసతులు కల్పించేలా ఈ స్కీమ్​లో గైడ్​లైన్స్​ రెడీ చేశారు. తారు రోడ్లు, సీసీ రోడ్లు, ఇంటర్‌‌ లాకింగ్  పేవర్  బ్లాక్  రోడ్లు, ఫుట్  ఓవర్  పాత్‌‌వేలు నిర్మించుకోవచ్చు. స్కూళ్లలో అడిషనల్​ క్లాస్​ రూమ్స్, డిజిటల్  ల్యాబ్‌‌లు, కిచెన్  షెడ్లు, ప్రైమరీ హెల్త్​ సెంటర్లు, వెటర్నరీ హాస్పిటల్స్,  అంగన్‌‌వాడీ సెంటర్లు, లైబ్రరీలు నిర్మించనున్నారు. 

మురుగునీటి శుద్ధి కోసం గ్రే-వాటర్  ట్రీట్‌‌మెంట్  ప్లాంట్లు, ఇంకుడు గుంతలు, ఘన వ్యర్థాల విభజన షెడ్లు, బయోగ్యాస్  ప్లాంట్లు, సోలార్  వీధి దీపాలు ఏర్పాటు చేసుకోవచ్చు. తుఫాను, వరద సహాయక పునరావాస కేంద్రాలు, రక్షణ గోడలు, నదుల కరకట్టల బలోపేతం, అడవుల్లో కార్చిచ్చు నివారణకు ఫైర్  బ్రేక్  లైన్లు ఏర్పాటు చేయనున్నారు. 

ప్రధానమంత్రి ఆవాస్  యోజన గ్రామీణ్(పీఎంఏవైజీ)తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు తోడ్పాటునందించేలా ప్లాన్​ చేశారు.