- సెన్సెక్స్ 1124 పాయింట్లు డౌన్.. 1.56 శాతం తగ్గిన నిఫ్టీ
- హార్మూజ్ పై ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన అమెరికా
- 108 డాలర్లకు బ్రెంట్ క్రూడ్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని కూడా భారీ నష్టాలతో ప్రారంభించాయి. హార్మూజ్ జలసంధిని తెరవడంపై ఇరాన్ పంపిన ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించడం మార్కెట్లను నిరాశపర్చింది. అమెరికాలో జరిగే నవంబర్ మిడ్ టర్మ్ ఎన్నికల తర్వాతనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర సోమవారం 3 శాతం పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరింది.
ఆయిల్ ధరలు పెరిగితే ఇండియా ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదు. దీనికితోడు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్ కారణాలతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,124.02 పాయింట్లు (1.52శాతం) క్షీణించి 72,771.72 వద్ద ముగియగా, నిఫ్టీ 360.25 పాయింట్లు (1.56శాతం) పతనమై 22,780.25 వద్ద స్థిరపడింది. సోమవారం ఒక్క సెషన్‌లోనే రూ.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం మేర పడిపోయాయి.190కి పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతానికి పైగా పతనమైంది. టెలికాం రంగం 2.3శాతం నష్టపోగా, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎల్ అండ్ టీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ ఎక్కువగా నష్టపోయాయి.
మరోవైపు టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ స్వల్ప లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), టాటా కన్స్యూమర్, అంబుజా సిమెంట్స్ సహా 190కి పైగా స్టాక్స్ తమ 52 వారాల కనిష్ట స్థాయిని టచ్ చేశాయి. మార్కెట్ గత ఏడు వారాలను నష్టాల్లో ముగించింది. సోమవారం కూడా కలుపుకుంటే ఈ టైమ్‌లో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.19.7 లక్షల కోట్లు తగ్గింది. నిపుణులు ఏమంటున్నారంటే?
- ‘‘టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోవడంతో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, 'ఓవర్‌సోల్డ్' జోన్‌లోకి జారుకోవడంతో ఇక్కడి నుంచి కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఇంట్రాడే ట్రేడర్లకు 22,800 కీలక స్థాయి. ఇది దాటితే 23,000–23,050 వరకు బౌన్స్‌బ్యాక్ రావచ్చు. దిగువన 22,650–22,550 వద్ద సపోర్ట్ లభించొచ్చు” అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ వివరించారు.
- ‘‘చమురు ధరలు, గ్లోబల్‌గా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండడంతో షార్ట్ టర్మ్‌లో మార్కెట్లు
- బలహీనంగానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి” అని మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు.
రూపాయి @96
డాలర్‌తో రూపాయి విలువ సోమవారం 22 పైసలు తగ్గి 95.97 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 96.05 కనిష్టాన్ని తాకి, గత రెండు వారాల్లో రెండోసారి 96 మార్కును దాటింది. విదేశీ ఇన్వెస్టర్లు ఒకేరోజు రూ.5,353 కోట్ల విలువైన షేర్లను అమ్మడంతో కరెన్సీపై ఒత్తిడి పెరిగింది.
క్రూడాయిల్ 120 డాలర్లకు !
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరే ప్రమాదముందని
బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తెలిపింది. కంపెనీ అంచనాల ప్రకారం, ధరలు 95–110 డాలర్ల మధ్య స్థిరపడొచ్చు. పరిస్థితులు అధ్వాన్నంగా మారితే 120 డాలర్లను టచ్ చేసే ప్రమాదం ఉంది.
రానున్న రెండు నెలలు మాత్రం 100–110 డాలర్ల మధ్యే కదులుతుంది. ప్రతి 10 డాలర్ల పెరుగుదల కారణంగా భారత కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.3–0.4శాతం మేర పెరగగా, ద్రవ్యోల్బణం 20–30 బేసిస్ పాయింట్లు ఎక్కువవుతుంది. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రూ.94–రూ.98 మధ్య, జీడీపీ వృద్ధి 6.6–7శాతం ఉండొచ్చని బ్రిక్‌వర్క్ అంచనా వేసింది.
