హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో తొలి రేర్-ఎర్త్ మాగ్నెట్ ప్లాంట్.. రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న మిడ్‌‌‌‌‌‌‌‌ వెస్ట్ ఎనర్జీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో తొలి రేర్-ఎర్త్ మాగ్నెట్ ప్లాంట్.. రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న మిడ్‌‌‌‌‌‌‌‌ వెస్ట్ ఎనర్జీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన మిడ్‌‌‌‌‌‌‌‌వెస్ట్ ఎనర్జీ సంస్థ సిటీలో దేశంలోనే మొట్టమొదటి సింటర్డ్ నియోడైమియమ్- ఐరన్- బోరాన్ (ఎన్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌ఈడీ) రేర్ ఎర్త్‌‌‌‌‌‌‌‌ పర్మినెంట్ మాగ్నెట్స్‌‌‌‌‌‌‌‌  తయారీ  ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.  ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుండగా, అక్టోబర్ మధ్య నాటికి 500 మెట్రిక్ టన్నుల  వార్షిక సామర్థ్యంతో కమర్షియల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కానుంది.   

భారత్ ప్రస్తుతం ఈ రేర్-ఎర్త్ మాగ్నెట్స్‌‌‌‌‌‌‌‌ కోసం దాదాపు 100శాతం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. వచ్చే 3–5 ఏళ్లలో దేశీయ దిగుమతి డిమాండ్‌‌‌‌‌‌‌‌లో 15–20శాతం భర్తీ చేసేందుకు ఈ ప్లాంట్ సాయపడుతుంది. ఈ అయస్కాంతాలను ఈవీల మోటార్లు, విండ్ టర్బైన్లు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, రక్షణ పరికరాలు, ఎంఆర్ఐ  స్కానింగ్ మెషీన్లలో ఉపయోగిస్తారు. 

కొన్ని  ఈవీ, విండ్ ఎనర్జీ సంస్థలకు ఇప్పటికే శాంపిల్స్ పంపామని  మిడ్‌‌‌‌‌‌‌‌వెస్ట్ పేర్కొంది.  డిసెంబర్ 2027 నాటికి రూ.2 వేల  కోట్ల ఖర్చుతో సామర్థ్యాన్ని 5,000 మెట్రిక్ టన్నులకు విస్తారిస్తామని తెలిపింది.