- ఈ ఏడాది 100 జీసీసీల ఏర్పాటులక్ష్యమని ప్రకటన
న్యూఢిల్లీ: క్యాష్ జనరేషన్, ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్, డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అందించే యూఎస్ కంపెనీ బిల్ట్రస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం జీసీసీల పురోగతికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఈ సెంటర్ను 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారని తెలిపారు.
అనతికాలంలోనే హైదరాబాద్ జీసీసీలకు హబ్ గా మారిందన్నారు. గతేడాది 75 కు పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్లో లభిస్తున్న సాంకేతిక నైపుణ్యం ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ఎంతో కీలకమని బిల్ట్రస్ట్ సీఈఓ గ్రాంట్ హల్లొరన్ చెప్పారు.
మూడేళ్లలో వెయ్యి మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్ట్రస్ట్ ఆఫీసు ఏర్పాటయింది. ఆరు నెలల్లోనే వంద మంది ఉద్యోగులతో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఏఐ టెక్నాలజీలతో కూడిన సేవలను అందించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు సాగుతోందని ఇండియా జీసీసీ కంట్రీ హెడ్ ఫర్హాద్ బారియా తెలిపారు.
