పంజాగుట్ట, వెలుగు: విద్యుత్ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. సోమవారం సోమాజిగూడ లోని విద్యుత్ సౌధలో నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలివచ్చి విద్యుత్ కంపెనీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ సంస్థలో లేని రూల్స్ విద్యుత్ శాఖలో అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.శ్యామ్ మనోహర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సభలో సంఘం సెక్రటరీ జనరల్ రమేశ్ మేడి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్ము చంద్రయ్య, ట్రాన్స్ కో అధ్యక్షుడు డాక్టర్ ఎం.శరబంధ, జీఎస్ తలారి సత్యనారాయణ, జెన్ కో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంను కలిశాం
విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్ల విషయంలో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాతంగి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం ప్రతినిధులు నారాయణ నాయక్, ఎం.రాంజీతో కలిసి మాట్లాడారు.
