పెండింగ్ చలాన్లు చెల్లించకుంటే కరెంట్ కనెక్షన్ కట్ చేయండి: సుప్రీం

పెండింగ్ చలాన్లు చెల్లించకుంటే కరెంట్ కనెక్షన్ కట్ చేయండి: సుప్రీం
  • వాహనం జప్తు చేయండి.. లైసెన్స్ బ్లాక్‌‌‌‌లిస్ట్‌‌‌‌లో పెట్టండి
  • ఈ ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలి
  • సుప్రీంకోర్టు కీలక సూచనలు

న్యూఢిల్లీ: పెండింగ్ చలాన్ల వసూళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఏండ్ల తరబడి పేరుకుపోయిన చలాన్లకు సంబంధించిన జరిమానాలను సంబంధిత వాహనదారుడి ఇంటి కరెంట్ బిల్లుకు కలిపి వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ఈ మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ లోని సెక్షన్ 136ఏ ప్రకారం ‘ఎలక్ట్రానిక్ ఎన్ ఫోర్స్ మెంట్ మెకానిజం’ అమలు చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సుమారు రూ.45,000 కోట్ల ఈ-చలాన్ బకాయిలు ఉండగా, అందులో ఇప్పటివరకు కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయని పిటిషనర్ కోర్టుకు వెల్లడించారు.

దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ట్రాఫిక్ సిబ్బంది కేవలం చలాన్లు విధిస్తే సరిపోదని, ఫైన్లను వసూలు చేయడంపైనా దృష్టి సారించాలని కోర్టు పేర్కొంది. ఇందుకోసం వినూత్న మార్గాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది.

వాహనదారుల ఇంటి కరెంట్ బిల్లుకు ఈ పెండింగ్ చలాన్ల జరిమానా మొత్తాన్ని కలిపేయాలని, అప్పటికీ చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ నిలిపివేయాలని పేర్కొంది. సంబంధిత వాహనాలను జప్తు చేయడంతో పాటు పరివాహన్ పోర్టల్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని తెలిపింది.

పెండింగ్ చలాన్ల మొత్తాన్ని పూర్తిగా చెల్లించే వరకు సంబంధిత వాహన యజమానికి చెందిన డ్రైవింగ్ లైసెన్స్తో పాటు, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల రెన్యూవల్, ఫిట్ నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడం తదితర చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ సూచించింది. అయితే, ఇవన్నీ కేసు విచారణలో భాగంగా చేసిన ప్రాథమిక సూచనలు మాత్రమేనని, అధికారిక ఆదేశాలు కావని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.

మా ఆదేశాలు అమలు చేయండి
రోడ్డు భద్రతకు సంబంధించి తాము ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాల అమలుపై అమికస్ క్యూరీ (సీనియర్ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్) ను బెంచ్ నిలదీసింది. కోర్టు ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగితే ఏదో ఒకరోజు తాము కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, అది అధికారులకైతే నచ్చదని బెంచ్​ హెచ్చరించింది.