- లారీ, ఆటో ఢీ.. నలుగురు మహిళలు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
- బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పిన ఆటో
- అదే సమయంలో లారీ రావడంతో ప్రమాదం
- మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎన్‌హెచ్‌పై ఘటన
- మృతులంతా మందమర్రి మండలవాసులు
- ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు
- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సంతాపం
- మృతుల కుటుంబాలకు మంత్రి ఆర్థిక సాయం
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్ నేషనల్ హైవేపై నస్పూర్ వద్ద లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనా స్థలిలోనే ఇద్దరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన చింతకుంట్ల లక్ష్మి(28), తోటపల్లి సోని (25), గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన అగ్గు సౌందర్య(34), తొగరి సుమలత(25)గా గుర్తించారు.
సల్లూరి అనూష, రాంటెంకి దివ్యవాణి, శీలం భాను, ఆటో డ్రైవర్ సెగ్యం ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మందమర్రి మండలం పొన్నారం, వెంకటాపూర్గుడిపెల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నారు. రోజులాగే సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు.
నస్పూర్గేటు వద్ద హఠాత్తుగా ముందునుంచి వచ్చిన బైక్నుతప్పించే క్రమంలో ఆటో ఆదుపుతప్పి.. అదే టైమ్ లో మంచిర్యాల నుంచి జైపూర్ వైపు వేగంగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఆటో గాలిలోకి ఎగిరి కిందపడగా.. పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న చింతకుంట్ల లక్ష్మి, సౌందర్య అక్కడిక్కడే మృతిచెందగా.. సోని, సుమలత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని మెరుగైన వైద్యం కోసం వరంగల్, కరీంనగర్ ఆసుప్రతులకు పంపించారు.
వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలాన్ని, ఆసుపత్రిని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా, డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, సీఐ రవిందర్ సందర్శించి వివరాలు సేకరించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని సీపీ చెప్పారు. మంచిర్యాల సీఐ రవిందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పది నిమిషాలైతే షాప్‌కు చేరుకునేటోళ్లు..
మందమర్రి మండలం పొన్నారం, గుడిపెల్లి, వెంకటాపూర్‌కు చెందిన మహిళలు, యువతులు మంచిర్యాలలో షాపింగ్ మాల్స్ , ఇతర చోట్ల కూలి పనుల కోసం రోజూ వెళ్తుంటారు. వీరు రెండేండ్లుగా గుడిపెల్లికి చెందిన ప్రశాంత్ఆటోలో ఉదయం మంచిర్యాలకు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తున్నారు. సోమవారం ఉదయం ప్రశాంత్కొందరిని మంచిర్యాలలో దింపి వచ్చాడు. రెండో ట్రిప్‌లో ఏడుగురిని తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 10 నిమిషాల్లో వారు గమ్యస్థానాలు చేరుకోవాల్సి ఉండగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మంత్రి, ఎంపీ దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండలానికి చెందిన నలుగురు మహిళలు మృతిచెందడం, మరో నలుగురు తీవ్రగాయాలైన ఘటనపై రాష్ట్ర శక్తి, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 వేలు, గాయపడిన వారికి రూ.10 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ లీడర్ జగన్మోహన్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉప్పలయ్య, వేణు, మాజీ కౌన్సిలర్సంజీవ్, రాజు, రాజేశ్.. మంత్రి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు.
