- వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం
- సంక్షేమ వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
- పర్యాటక రంగం విస్తరిస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుంది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఔషధ మొక్కలు పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి శనివారం అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ వసతి గృహాల కోసం భవన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఆర్థికశాఖకు వచ్చే విధంగా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ వేసవిలో వసతి గృహాల మరమ్మతు పనులు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయొద్దన్నారు. సంక్షేమ వసతి గృహాల అద్దెలు, ఎలక్ట్రికల్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామన్నారు. అధికారులు సకాలంలో ఆర్థికశాఖకు బిల్లులు పంపాలని చెప్పారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చెకింగ్ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి బోధన, భోజనం నాణ్యత, సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే అడవిని స్థానికులే కాపాడుకుంటారని తెలిపారు. పర్యాటక రంగం విస్తరిస్తే స్థానికులకు ఉపాధితోపాటు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. వారసత్వంగా వస్తున్న దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సబ్యసాచి ఘోష్, కృష్ణ ఆదిత్య, క్రిస్టినా, సువర్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
