- కచ్చితమైన వర్క్ క్యాలెండర్‌తో పనులు పూర్తి చేయాలి
- నిర్మాణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
- అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్‌లో పాఠశాలల భవన నిర్మాణ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమించాలని సూచించారు.
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య, సకల సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల పిల్లలను ఒకే చోట చేర్చి సమీకృత విధానంలో విద్య అందించడం ద్వారా సామాజిక సమానత్వాన్ని పెంపొందించవచ్చన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మిస్తున్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రత్యేక వర్క్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
వారానికోసారి పనుల పురోగతిని సమీక్షించి నివేదికలు ఇవ్వాలన్నారు. నిర్మాణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే నెల రెండో వారం నుంచి తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని తెలిపారు. రాష్ట్రంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరయ్యాయని, 70 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వివరించారు. మరో ఐదింటికి డీపీఆర్‌లు తయారవుతున్నాయని, మూడు పాఠశాలల టెండర్లు తుది దశలో ఉన్నాయని, నాలుగు చోట్ల స్థల సమస్యలున్నాయని తెలిపారు.
