- అర్హులంతా మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే
- నవంబర్ 6 వరకు ఓటు నమోదుకు గడువు
- వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానాలకు ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సోమవారం ప్రారంభించడంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాలు కావడంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుంటున్నాయి. గరిష్ఠ స్థాయిలో ఓట్లను నమోదు చేయించడమే కాకుండా, గ్రాడ్యుయేట్ల ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను దింపేందుకు కసరత్తు వేగవంతం చేశాయి.
సన్నాహక సమావేశాలు
ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ గతానికి భిన్నంగా, అత్యంత పకడ్బందీగా సాగుతుండటంతో పార్టీల వ్యూహకర్తలు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. పాత ఓటర్ల జాబితాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మళ్లీ కొత్తగా ఫారమ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ నిబంధన పెట్టింది. ఈ సారి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిన్నారు. 2023 నవంబర్ 1 నాటికి లేదా అంతకంటే ముందే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీల శ్రేణులు ఊరూరా, కాలేజీల వారీగా, ఉద్యోగ వర్గాల్లో ప్రచారం మొదలుపెట్టాయి.
గ్రాడ్యుయేట్ల యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాల్లో ముందస్తుగా ఓటు నమోదు చేయించిన పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ 6వ తేదీ వరకు ఫారమ్-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించనుండగా, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. 2027 మార్చి నాటికి ఈ స్థానాల పదవీకాలం ముగియనుంది.
నేడో రేపో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు
కాంగ్రెస్ తరఫున ముగ్గురు చొప్పున ఆశావహుల పేర్లను పీసీసీ ఇప్పటికే హైకమాండ్‌కు పంపించింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ బలాబలాల ఆధారంగా ఇద్దరి పేర్లను నేడో, రేపో ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నందున ఈ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. తన పట్టు నిలుపుకునేందుకు బలమైన నేతలను బరిలోకి దింపే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గాల్లో గతంలోనూ గణనీయమైన ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నవారితో పాటు, సామాజిక వేదికలపై చురుగ్గా ఉండే విద్యావేత్తలు, విశ్లేషకులను రంగంలోకి దించడం ద్వారా పట్టభద్రుల మనసు గెలుచుకోవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటు వీస్తుందో చెప్పడానికి ఒక సంకేతమనే చర్చ జరుగుతోంది. నవంబర్ నాటికి ముసాయిదా, డిసెంబర్ నాటికి తుది ఓటర్ల జాబితా రానుండటంతో ఆ లోపే గరిష్ఠంగా తమ మద్దతుదారుల ఓట్లు నమోదయ్యేలా నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
