- శ్రీశంకర్, గుల్వీర్ కు రజతాలు
- పీటీ ఉష రికార్డును బ్రేక్ చేసిన విత్య
నగోయా: తెలంగాణ స్టార్ షూటర్, వరల్డ్ నంబర్‌వన్ ఇషా సింగ్.. ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో జియావో జియారుయిక్సువాన్ (చైనా)తో హోరాహోరీగా సాగిన రెండు రౌండ్ల షూటౌఫ్‌లో ఇషా ఒక్క షాట్ మిస్సయింది. దాంతో రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. నిర్ణీత రౌండ్లలో ఇద్దరు షూటర్లు 38 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షూటాఫ్‌ను నిర్వహించారు.
అంతకుముందు ఉత్తర కొరియా షూటర్ కిమ్ హ్యోన్ సుక్‌తో జరిగిన మూడు రౌండ్ల షూటాఫ్‌లో ఇషా విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. దాంతో హ్యోన్ సుక్ 34 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ‘ఫైనల్లో కొద్దిగా ఒత్తిడికి లోనయ్యా. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ ఇదే. చివరలో నా చేతులు నొప్పి పుట్టాయి’ అని ఇషా పేర్కొంది. క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో ఇషా 580 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌లో నిలవగా, స్టార్ షూటర్ మను భాకర్ 579 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమైంది.
ఓవరాల్‌గా మను ఈ క్రీడల్లో పతకం లేకుండానే వెనుదిరిగింది. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో కూడా ఇండియా మెడల్ రేసులో నిలిచింది. కానీ కీలక దశలో రాహీ సర్నోబాత్ ఒక్క షాట్ మిస్ చేయడం ఇండియాకు ప్రతికూలంగా మారింది. నాలుగో సిరీస్‌లో సర్నోబాత్ 39 పాయింట్లకే పరిమితం కావడంతో ఇండియాకు మెడల్ గెలిచే చాన్స్ మిస్సయింది. సర్నోబాత్ 568 పాయింట్లతో 30వ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ట్రాప్ షూటింగ్‌లో నీరూ దండా గోల్డ్ మెడల్ దిశగా సాగుతోంది. విమెన్స్ క్వాలిఫికేషన్స్‌లో నీరూ 24, 24, 23 స్కోరుతో మొత్తం 95 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఖతార్ షూటర్ బాసిల్ రే కన్నా ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది.
సెమీస్ లో పాక్ తో ఫైట్
హాకీలో ఇండియా మెన్స్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన పూల్–ఎ చివరి మ్యాచ్‌లో ఇండియా 10–0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దాంతో లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇండియా తరఫున అభిషేక్ (3వ నిమిషం), జుగ్‌రాజ్ సింగ్ (22వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 40, 45 నిమిషాలు), సుఖ్‌జీత్ సింగ్ (32వ నిమిషం), లాక్రా శీలానంద్ (44, 45 నిమిషాలు), సంజయ్ (59వ నిమిషం), మన్‌దీప్ సింగ్ (60వ నిమిషం) గోల్స్ సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. గురువారం జరిగే సెమీస్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.
బాక్సింగ్ మూడు పతకాలు ఖాయం
నిషియో: ఆసియా క్రీడల్లో ఇండియా బాక్సర్లు లవ్లీనా బోర్గోహైన్, ప్రియ గంగాస్, కపిల్ పోఖారియా సెమీస్‌లోకి ప్రవేశించి మూడు పతకాలను ఖాయం చేశారు. విమెన్స్ 75 కేజీల క్వార్టర్‌ఫైనల్లో లవ్లీనా 5–0తో సియోంగ్ సుయెన్ (సౌత్ కొరియా)పై గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా హాంగ్జౌ క్రీడల్లో సిల్వర్ మెడల్‌ను సాధించింది.
60 కేజీల్లో ప్రియ గంగాస్.. మిజ్గోనా సమదోవా (తజకిస్తాన్)పై ఏకగ్రీవ విజయం సాధించింది. తొలి రౌండ్‌లో వెనకబడినా.. తర్వాతి రెండు రౌండ్లలో బలమైన పంచ్‌లతో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మెన్స్ 90 కేజీల్లో కపిల్ 5–0తో కిమ్ గిచాయ్ (కొరియా)పై గెలిచాడు.
కురాష్‌లో బ్రాంజ్
ఆసియా క్రీడల్లో కురాష్ ప్లేయర్ పింకీ బల్హారా కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన విమెన్స్ 78 కేజీల సెమీ ఫైనల్లో పింకీ 0–5తో సుమిన్ మో (సౌత్ కొరియా) చేతిలో ఓడి మూడో ప్లేస్‌తో సంతృప్తి పడింది. దాంతో కురాష్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
సెమీస్‌లో పింకీకి ‘డక్కీ’ (పెనాల్టీ) లభించగా, సుమిన్ మో ‘యోన్బోష్’ పాయింట్ సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పింకీ 3–0తో గరం లిమ్‌ను ఓడించింది. 2018 జకర్తా క్రీడల్లో తొలిసారి కురాష్‌ను ప్రవేశపెట్టినప్పుడు పింకీ 52 కేజీల్లో సిల్వర్ మెడల్‌ను గెలుచుకుంది. 2018 ఆసియా క్రీడల్లో మాలప్రభ జాదవ్ కాంస్యం నెగ్గింది.
పీటీ ఉష రికార్డు బద్దలు కొట్టి..
విమెన్స్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య రామ్‌రాజ్ కాంస్యం నెగ్గింది. ఫైనల్లో విత్య 54.75 సెకన్ల టైమింగ్‌తో మూడో ప్లేస్‌లో నిలిచింది. ఈ క్రమంలో లెజెండ్ రన్నర్ పీటీ ఉష నాలుగు దశాబ్దాల కిందట నెలకొల్పిన 55.42 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఉష ఈ రికార్డును నెలకొల్పింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో విత్యకు ఇది రెండో మెడల్ కావడం విశేషం. సిల్వర్ మెడల్ గెలిచిన 4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో ఆమె సభ్యురాలు. మరియం కరీం (యూఏఈ, 54.31 సెకన్లు), అడెలినా జేమ్స్ (కజకిస్తాన్, 54.58 సెకన్లు) వరుసగా గోల్డ్, సిల్వర్ గెలిచారు.
ఇండియాకే చెందిన అను రాఘవన్ 55.58 సెకన్ల టైమింగ్‌తో ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అవినాశ్ సాబ్లే (8:21.67 సెకన్లు) నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్ కుమార్ తమిళరసన్ 49.95 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచాడు. విమెన్స్ డిస్కస్ త్రో ఫైనల్లో సీమా 59.88 మీటర్ల దూరాన్ని నమోదు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.
అథ్లెటిక్స్‌లో హవా
అథ్లెటిక్స్‌లో ఇండియా అథ్లెట్ల పతకాల వేట జోరుగా కొనసాగుతోంది. మెన్స్ లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, 1500 మీటర్లలో గుల్వీర్ సింగ్, జావెలిన్‌త్రోలో యశ్‌వీర్ రజత పతకాలను సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన లాంగ్ జంప్ ఫైనల్లో 27 ఏళ్ల శ్రీశంకర్ తన రెండో ప్రయత్నంలో 8.07 మీటర్ల దూరాన్ని నమోదు చేసి రెండో ప్లేస్‌లో నిలిచాడు. నాలుగో ప్రయత్నంలో శ్రీశంకర్ చీలమండకు గాయం కావడంతో చివరి రెండు ప్రయత్నాలను వదిలేసుకున్నాడు.
చైనా అథ్లెట్ యుహావో షి (8.17 మీటర్లు) ఈ సీజన్‌లో అత్యుత్తమ దూరాన్ని నమోదు చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ అన్వర్ అన్వరోవ్ (8.06 మీటర్లు) బ్రాంజ్ మెడల్‌ను సాధించాడు. మెన్స్ 1500 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ 3:36.72 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంతో సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
విమెన్స్ 5 వేల మీటర్ల ఫైనల్లో పారుల్ చౌదరి 15:14.61 సెకన్ల టైమింగ్‌తో మూడో ప్లేస్‌లో నిలిచి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లోనూ కాంస్యం నెగ్గిన పారుల్‌కు ఈ క్రీడల్లో రెండో పతకం కావడం విశేషం. మెన్స్ జావెలిన్ త్రోలో యశ్‌వీర్ సింగ్ (85.72 మీటర్లు), రోహిత్ యాదవ్ (84.35 మీటర్లు) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు. శ్రీలంక అథ్లెట్ రుమేష్ పతిరాగే (88.38 మీటర్లు) స్వర్ణం నెగ్గాడు
