వెంకటాపురం, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్సీలకు భూమి హక్కులు కల్పించాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరింది. భూములకు పట్టాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని విజ్క్షప్తి చేసింది.
సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దుర్గం నగేశ్ ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు సోమవారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కుటుంబాలు సుమారు 130 ఏండ్లుగా నివసిస్తున్నా.. వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
1950కి ముందు నుంచి పరంపోగు, ఖారిజ్‌ఖాతా, ఇనాం భూములు సాగు చేస్తున్న అర్హులైన ఎస్సీ కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పట్టాలు లేక రైతు భరోసా, బ్యాంకు రుణాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదన్నారు.
ఏజెన్సీ భూ నిబంధనల వల్ల వారసత్వ బదిలీలు, కుటుంబ భూ విభజనలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. కాగా, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డానియల్, రవీందర్, శ్యామ్, రాహుల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
