పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

వైరా, వెలుగు : పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వైరాలోని అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి రింగ్​రోడ్డు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఎందుకు ఓటు వేయాలని పట్టణ ప్రజలు ఆ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పారు.

పదేండ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు వారికి ఓటు వేయాలా..? తెలంగాణను అప్పల పాలు చేసినందుకు ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక ఇల్లు.. ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక పేదలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని, రాష్ట్రంలో మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఇచ్చామని చెప్పారు.

ఇందుకు కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా, 1.02 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినలేక కోళ్ల దానాకు ఉపయోగించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం కిలో రూ.50  విలువైన సన్నబియ్యాన్ని ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుందన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ సంస్థలకు ప్రతినెలా పేదల పక్షాన ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తోందన్నారు. మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, హస్తకళా చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మధిరను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా..

మధిర: మున్సిపల్ కాంగ్రెస్, టీడీపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మధిరను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని దిడుగుపాడు గ్రామంలోని 1, 8 వార్డుల్లో ఆయన రోడ్​షో నిర్వహించారు. సందర్భంగా డిప్యూటీ సీఎంకు ప్రజలు పూలతో ఘనస్వాగతం పలికారు.  ఆ గ్రామంలోని వైఎస్​ఆర్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రపంచంతోనే పోటీపడే విధంగా యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్​నిర్మిస్తున్నట్లు తెలిపారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైరా నదిపై రిటైనింగ్ వాల్​నిర్మిస్తామన్నారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్​ పార్కు, ఫుడ్​కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకటో వార్డు అభ్యర్థి శిరీష, 8వ వార్డు అభ్యర్థి యన్నం కోటేశ్వరరావును భారీ మెజార్టీతో  గెలిపించాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు.