- ఇంటి సమీపంలో కాలిపోయిన స్థితిలో గుర్తింపు
కొండాపూర్, వెలుగు : సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ పీఏ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కొండాపూర్ ఎస్ఐ వినయ్ కుమార్ కథనం ప్రకారం..కొండాపూర్ మండలం మల్కాపూర్ పరిధిలోని తెలంగాణ టౌన్ షిప్ కు చెందిన గడీల విష్ణువర్ధన్(40) జూనియర్ అసిస్టెంట్. ఈయన సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ దగ్గర పీఏగా పని చేశాడు. మే నెలలో గుండెకు సర్జరీ జరగడంతో అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కారు తీసుకుని బయటకు వెళ్లాడు.
రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి రాత్రి 10:30 గంటలకు అతడి తండ్రి నారాయణ రావు ఫోన్ చేశాడు. కాసేపట్లో వస్తానని చెప్పినా రాలేదు. ఆదివారం ఉదయం ఇంటికి మూడు వందల మీటర్ల దూరంలో ఓ వ్యక్తికి చెందిన బీడు భూమిలో పాక్షికంగా కాలిపోయిన స్థితిలో డెడ్‌బాడీ కనిపించింది. వాకింగ్‌కు వెళ్లినవాళ్లు చూసి కుటుంబసభ్యులకు చెప్పారు. వారు వచ్చి ఆ డెడ్‌బాడీ విష్ణువర్ధన్ దే అని కన్ఫమ్ చేశారు. మృతిపై తమకు అనుమానాలున్నాయని తండ్రి విఠల్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు.
