చివరి దశకు ‘దేవాదుల’... ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి..

చివరి దశకు ‘దేవాదుల’... ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి..
  • వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రభుత్వం డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌
  • పెండింగ్‌‌‌‌‌‌‌‌లో మరో 2,659 ఎకరాల భూ సేకరణ
  • భూమి విషయంలో కోర్టు కేసులు, పరిహారం సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు

హనుమకొండ, వెలుగు : రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ‘జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల’ పథకం పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 31 నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విధించింది. మొత్తం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పనుల్లో ఇప్పటికే 90 శాతం పూర్తిగా.. డిస్ట్రిబ్యూటరీలకు చెందిన పనులు మాత్రమే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

ఈ పనులకు ప్రధాన సమస్యగా మారిన భూ సేకరణపై ఆఫీసర్లు ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. కోర్టు కేసులు, రైతుల పరిహారానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని వివిధ జిల్లాల్లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో భూ సేకరణను పూర్తి  చేయడంతో పాటు ప్లాట్లుగా మారిన భూములను ఆయకట్టు నుంచి తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు మరో ఏడాదిన్నర సమయం ఉండడంతో ఆ లోగా మిగతా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు  చేపట్టారు.

38.5టీఎంసీలు.. 5.56 లక్షల ఎకరాలు

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నుంచి 38.5 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందించాలన్న లక్ష్యంతో జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో 2004లో పనులు మొదలు కాగా, వివిధ కారణాల వల్ల ఆలస్యంగా సాగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016–--17లో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూ.13,445 కోట్లకు పెంచారు. అయినా పనులు కంప్లీట్ కాకపోవడంతో 2022లో మరోసారి రూ.17,500 కోట్లకు పెంచారు. 

కానీ సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులను ప్రయారిటీ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చేర్చి, బడ్జెట్ రీ ఎస్టిమేషన్స్ పంపాలని ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో ఆఫీసర్లు రూ.18,400 కోట్లకు ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో ఇప్పటికే రూ.14,422 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. మరో రూ.3,978 కోట్ల నిధులు మంజూరు చేస్తే మిగతా పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

భూ సేకరణ అడ్డంకులు తొలగించేలా...

దేవాదుల ప్రాజెక్టు పనులకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆలేరు, భూపాలపల్లి, గజ్వేల్, హుస్నాబాద్, హుజురాబాద్, జనగామ, మంథని, ములుగు, నర్సంపేట, పాలకుర్తి, పరకాల, స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట, తుంగతుర్తి, వరంగల్‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌‌‌‌‌‌‌‌, వర్ధన్నపేట, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఈ 17 నియోజకవర్గాల పరిధిలో 34,612 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 31,952.2ఎకరాలు సేకరణ పూర్తి అయింది. 

మరో 2,659.2 ఎకరాలు కావాల్సి ఉండగా...  ఉండగా.. కోర్టు కేసులు, రైతులు పరిహారానికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రక్రియ ఇంతకాలం స్లోగా నడిచింది. కానీ కేసులు, పరిహారం సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల సహకారంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో పెండింగ్‌‌‌‌‌‌‌‌ భూసేకరణపై ఆఫీసర్లు ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేశారు. అవసరమైన చోట రైతులతో మరోసారి మీటింగ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

అర్బనైజేషన్‌‌‌‌‌‌‌‌ కారణంగా 39 వేల ఎకరాలు కట్‌‌‌‌‌‌‌‌

దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఇప్పటికే 3,33,621 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌ పనులన్నీ పూర్తి చేసి మిగతా 2,23,101 ఎకరాలను కూడా స్థిరీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ వరంగల్‌‌‌‌‌‌‌‌తో పాటు వివిధ జిల్లాల్లో అర్బనైజేషన్‌‌‌‌‌‌‌‌ కారణంగా చాలా చోట్ల ఆయకట్టు ప్రతిపాదిత ప్రాంతాలు సాగుకు యోగ్యంగా లేని పరిస్థితి నెలకొంది. 

దీంతో సుమారు 39 వేల ఎకరాలను  ఆయకట్టు నుంచి తొలగించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దీంతో దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు 5.17 లక్షల ఎకరాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తుండగా.. ఈ  ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు.

వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌

దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో కీలకమైన దేవన్నపేట పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌తో పాటు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పనులను మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు పరిశీలించారు. పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లోని రెండు మోటార్లు పని చేస్తుండగా.. మూడో మోటార్ ఎన్‌‌‌‌‌‌‌‌కేసింగ్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. 

ఈ మేరకు వచ్చే ఏడాది డిసెంబర్ 31లోగా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విధించారు. దీంతో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 2,659.2 ఎకరాల భూ సేకరణకు చర్యలు చేపట్టగా... 634 ఎకరాలకు ఇటీవలే అవార్డ్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఏది ఏమైనా వచ్చే ఏడాది డిసెంబర్ 31లోగానే పనులన్నీ పూర్తి చేస్తామని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.