దేవరగట్టు కొండపై బన్ని ఉత్సవాలు రద్దు

దేవరగట్టు కొండపై బన్ని ఉత్సవాలు రద్దు

ఇవాళ అర్థరాత్రి జనం లేకుండా కేవలం వేద పండితుల సమక్షంలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం..
సంప్రదాయ ఉత్సవం కర్రల సమరం నిషేధం..
మొత్తం ఉత్సవాలే రద్దు చేసినట్లు ప్రకటన
అయినా భక్తులు వస్తారేమోనని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసుల
1500 మంది పోలీసుల మొహరింపు
అడుగడుగునా సీసీ కెమెరాలు.. ఫాల్కన్ వాహనంతో నిఘా
కరోనా వల్ల ఏదైనా జరగొచ్చు కాబట్టి ఎవరూ ఆలయం వైపు రావొద్దని టామ్ టామ్

కర్నూలు: దసరా ఉత్సవాలు దేశమంతటా కన్నుల పండుగలా జరుగుతాయి. అయితే ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టు కొండపై ఒళ్లు గగుర్పొడిచే రీతిలో జరిగే బన్ని ఉత్సవాలను రద్దు చేశారు. చరిత్రలోనే తొలిసారిగా కరోనా వల్ల జనం లేకుండానే ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా వల్ల ఈ సంవత్సరం రద్దు చేసినట్లు అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అర్ధరాత్రి కేవలం కొద్ది మంది వేద పండితులు ఆలయ పాలకమండలి సభ్యుల సమక్షంలో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది.

కొండపై నుంచి దిగిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల కోసం ఏడు గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటూ.. ముందు తమ గ్రామానికంటే.. కాదు ముందు తమ గ్రామానికి తీసుకెళ్లాలంటూ తలపడడం ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఆచారం. కర్రలను గాలిలో ఎగరేసుకుంటూ.. తలలు పగిలే రీతిలో కొట్టుకునే విభిన్న సంప్రదాయ క్రీడ దేవరగట్టు ప్రత్యేకత. రక్తం వచ్చేటట్లు కొట్టుకున్నా.. తలపై గాయాలతో రక్తం కారుతున్నా.. దెబ్బలు తిన్న వారు గాని.. కొట్టిన వారు కాని పోలీసులకే కాదు మరెవరికీ ఫిర్యాదు చేయరు. ఇది కేవలం సరదా ఆట.. పొరపాటున తగిలాయి అని సర్ది చెప్పుకుంటారు. చాలా భీభత్సంగా సాగే గ్రామోత్సవంలో కర్రలతో కొట్టుకునే సంప్రదాయ ఊరేగింపును ప్రతి సంవత్సరం పోలీసులు నిషేధించినా ప్రజలు ఎవరూ పాటించరు.

వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అర్థరాత్రి ఉత్సవ సమయానికి ఠంచనుగా కర్రలతో ప్రత్యక్షమవుతారు. కర్రలను లాక్కునేందుకు ప్రయత్నిస్తే పోలీసులపైనే దాడులకు దిగుతుంటారు. అయితే ఈసారి కట్టుదిట్టమైన టెక్నాలజీతో.. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు కర్రల సమరాన్ని నిరోధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి.. జనం జంకుతున్నారు.
ఏపీ-కర్నాటకకు సరిహద్దు కొండ దేవరగట్టు


దేవరగట్టు ఈ పేరు అంటే తెలియని వారు తెలుగు రాష్ర్టాల్లో ఎవరూ ఉండరు. మొత్తం దేశంలోనే దేవరగట్టు ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. దసరా వచ్చిందంటే చాలు అందరి చూపు దేవరగట్టుపైనే ఉంటాయి. కొండపై వెలసిన మాల మల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా అర్థరాత్రి జరిగే కర్రల సమరం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏపీకి కర్నాటకకు మధ్య సరిహద్దుగా ఉన్న ఈ కొండపై దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా జరిగే ఊరేగింపులో కర్రలతో గుంపులు గుంపులుగా కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ ఆటవిక సాంప్రదాయంతో తీవ్ర గాయాల పాలు కావడం వివాదాస్పదం అవుతోంది. గాయపడిన కొందరు చనిపోయినా ప్రజలెవరూ ఫిర్యాదులు చేయరు. అయితే దీని పై మీడియా ఫోకస్ చేయడం, ఆనోటా ఈనోటా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారించింది. కర్రల సమరాన్ని నివారించేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో భాగంగానే ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికే ముందే దేవరగట్టు ఉత్సవంలో పాల్లొనే గ్రామాలపై పోలీసులు దండయాత్ర చేసేవారు. తమ కనుచూపులో కనపడే ప్రతి కర్రను సేకరించేవారు. గ్రామస్థులకు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసేవారు. దేవరగట్టు కొండకు చుట్టూ ఉన్న 30 గ్రామాలలో పోలీసులు పర్యటించి కర్రల సమరానికి దూరంగా ఉండాలని…. కర్రలతో కాకుండా సాంప్రదాయబద్దంగా పండుగను నిర్వహించుకోవాలని అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. ముఖ్యంగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట, ఎల్లార్తి, ఆలూరు,హరికెరతాండ ఈ ఏడు గ్రామాల పై ప్రధాన ద్రుష్టి సారించేవారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎన్ని కర్రలు స్వాధీనం చేసుకున్న……… గ్రామస్థులను ఎంత హెచ్చరించినా…. విజయదశమి రోజు వేల కర్రల-తో ప్రత్యక్షమవ్వడం పరిపాటిగా వస్తోంది.

ఇంతకూ బన్ని ఉత్సవం అంటే ఏమిటి..?


అసలు బన్ని ఉత్సవం అంటే ఏమిటి. విజయ దశమి రోజు ఈ కర్రల సమరం ఎందుకు జరుగుతుంది. మాలమల్లేశ్వర స్వామి కల్యాణం ఎలా జరిగింది అంటే స్థానికులు కథలు కథలుగా చెబుతారు. దసరా వచ్చిందంటే చాలు అందరి దృష్టి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు వైపే ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు. విజయదశమి రోజున అర్ధరాత్రి దేవరగట్టు కొండపై వెలసిన ఉత్సవ మూర్తులను కళ్యాణోత్సవ సందర్భంగా కిందకు తీసుకుని వస్తారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు ముందుగా తమ గ్రామానికి ఉత్సవమూర్తులు తీసుకెళ్లాలి అంటూ పోటీపడే ఉత్సవ మూర్తులను తమ గ్రామం వైపు తీసుకెళ్లేందుకు కర్రలతో బలప్రయోగానికి దిగుతారు. కొండ దిగిన తర్వాత దేవస్థానం పొలిమేర వద్ద కర్రలతో కొట్టుకునే దృశ్యాన్నితిలకించేందుకు లక్షలాది మంది వస్తారు. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వద్ద బన్ని ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు కర్రలు ధరించి కాగడాల వెళుతురులోనిర్వహించే ఊరేగింపు కొన్నిసార్లు గగుర్పాటు కలిగిస్తుంది. ఉత్సవ మూర్తులు మాకే దక్కాలి.. కాదు.. మాకే నంటూ గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చివిచక్షణా రహితంగా కర్రలతో కొట్టుకోవడం అనేది స్థానికుల దృష్టిలో వినోద క్రీడ. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది సాయంత్రమే తరలివచ్చి కొండలపై కాస్త జాగా దక్కించుకుని తెల్లవార్లు జాగరణ చేసి మరీ ఉత్సవాలను తిలకిస్తారు. అర్ధరాత్రి జరిగే ప్రధాన ఘట్టం జైత్రయాత్ర. హోళగుంద మండలంలోని అరికెర, నెరణికి, నెరణికి తాండ తదితర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు కర్రలు చేతపట్టుకుని కాగడాల వెళుతురులో జైత్రయాత్రలో పాల్గొంటారు. ఉత్సవ మూర్తులను తమ గ్రామానికి దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడే దృశ్యాలు గగుర్పాటు కలిగిస్తాయి. కర్రలు చేత ధరించి డుర్.. డుబుక్.. డుర్ మంటూ.. అదోరకమైన యాసతో శబ్బం సృష్టిస్తూ భక్తులు పరిగెత్తుకుంటూ వెళ్లే దృశ్యాలు.. ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు కనిపిస్తాయి.

బన్ని ఉత్సవాలు.. ఆచారం ఎలా మొదలయ్యాయంటే..


దేవరగట్టు ఉత్సవాలు ఎలా మొదలైందనే విషయంపై స్థానికంగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉండే కొండల మధ్య పూర్వం మునులు తపస్సు చేస్తూ ప్రశాంతంగా జీవనం గడిపేవారు. వీరికి అతి సమీపంలోనే మణి , మల్లాసుర అనే రాక్షులు కూడా నివాసం ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడ్డుకునే వారు. రాక్షుల వికృత చేష్టలను భరించలేకపోయిన మునులు తమను కాపాడాలంటూ పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు. పార్వతీదేవి గంగిమాలమ్మ రూపంలో ప్రత్యక్షమై రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడిస్తుంది. రాక్షసులు చచ్చేముందు తమ చివరి కోరిక తీర్చాలని పార్వతీదేవిని కోరుకుంటారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కనీసం ఐదు చుక్కల రక్తమైనా ఇవ్వాలని ప్రాధేయపడగా పార్వతీదేవి అంగీకరిస్తుంది. రాక్షస సంహారం విజయదశమి రోజున జరగడంతో ప్రతి ఏటా దేవరగట్టు పై పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తుంటారు. అర్థరాత్రి జరిగే ఊరేగింపు కాబట్టి పురుగు పుట్రల భయంతో గతంలో కర్రల పై భాగాన రింగులు అమర్చుకుని శబ్దం చేసుకుంటూ వెళ్తుంటారు. భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమం కాలక్రమేణా కర్రలతో కొట్టుకునే కార్యక్రమంలా ప్రచారంలోకి వచ్చింది.
విజయ దశమి రోజున రాత్రి స్వామి వారి కళ్యాణోత్సవం మొదలు ఉత్సవ మూర్తులను సింహాసనం కట్టమీద అధిష్టించే వరకు జరిగే కార్యక్రమాలన్నింటినీ కలిపి బన్ని ఉత్సవంగా పేర్కొంటారు. కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. తెల్లవారు జామున శమీ పూజ, ఉదయం తెల్లవారిన తర్వాత బసవన్న కట్ట వద్ద ఆల య పూజారితో భవిష్య వాణి ఉంటాయి.


కరోనాతో బన్ని ఉత్సవాలు రద్దు

కరోనా నిబంధనల మేరకు బన్ని ఉత్సవాలు ఈసారి నిర్వహించడం లేదని ఆలయ పాలక మండలి ఇది వరకే ప్రకటించింది. నెల రోజుల ముందే పోలీసులు హడావుడి చేసే వారు. అయితే కరోని నిబంధనలు కఠినంగా ఉండడంతో అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం ఉండదు.. అందరూ ఒక చోట గుమిగూడడం ప్రాణాంతకం అవుతుంది కాబట్టి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కొంత మంది ఉత్సవాలకు వెళ్లి వస్తామని చెబుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 50 సిసి కెమెరాలు… 2 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలలో రికార్డయ్యే దృశ్యాలన్నీ చూసే సౌలభ్యం ఉన్న ఫాల్కన్ వాహనాన్ని దేవరగట్టు వద్దనే మొహరించనున్నారు. సుమారు 1500 మందికిపైగా పోలీసు బలగాలను దేవరగట్టు పరిసరాల్లో మొహరించారు. అలాగే బాడీ ఒన్ కెమెరాల తో, మఫ్టీ పోలీసు బృందాలతో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఉంచారు. ఎవరూ ఆలయం వైపు రాకుండా డ్రోన్ కెమెరాతో ఫోటోలు, విడియోల ద్వారా చీత్రీకరించి… కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కఠినంగా నిషేధం అమలు చేస్తున్నారు.