అభివృద్ధి, సంక్షేమంమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అభివృద్ధి, సంక్షేమంమే కాంగ్రెస్   ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పెగడపల్లి, వెలుగు:   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని బత్కపెల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన పెంట లక్ష్మి–మల్లేశం దంపతుల ఇంటిని మంత్రి ప్రారంభించారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధ్యతగా పనిచేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రత్యేక నిధులతో బత్కపెల్లిలో రోడ్లు, డ్రైనేజీలు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 7 వేల ఓటర్లు ఉన్న ఈ గ్రామం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. 

మహిళా సంఘ భవనాలు, కుల సంఘాల భవనాలు, పల్లె దవాఖాన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సుద్ధపల్లి, దోమలకుంట గ్రామాల్లో మహిళా సంఘాల వీఓ భవనాలకు భూమిపూజ చేశారు. సుద్ధపల్లిలో రూ.20 లక్షలు, దోమలకుంటలో రూ.10 లక్షల వ్యయంతో వీఓ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, సర్పంచులు ముంజ మహేశ్వరి, ఐతరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.