చెప్పిందే చేస్తం.. చేసేదే చెప్తం : కిషన్ రెడ్డి

చెప్పిందే చేస్తం.. చేసేదే చెప్తం : కిషన్ రెడ్డి
  •  రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తం
  • గజ్వేల్​ విజయ్​ సంకల్ప​ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

గజ్వేల్, వెలుగు: ప్రధాని మోదీ చెప్పిందే చేస్తారని, చేసేదే చెప్తారని.. ఇది మోదీ గ్యారంటీ అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌ చీఫ్ ​కిషన్​రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా తూప్రాన్​ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌దాకా బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​రావుతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచారంగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని కిషన్​రెడ్డి సందర్శించారు. 

అనంతరం గజ్వేల్​లో నిర్వహించిన సభలో మట్లాడారు. భారత ప్రధానిగా మోదీ మరోసారి ఎన్నిక కావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికే విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటేసే ముందు మీ కోసం, మీ పిల్లల భవిష్యత్​ కోసం, దేశం కోసం, అభివృద్ధి కోసం, నీతి కోసం, నిజాయతీ కోసం, ఆలోచించి వేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్​కు వచ్చిన 40 సీట్లు కూడా ఈసారి రావని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద కోపంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సెటైర్ వేశారు. రాష్ట్రంలో జరిగే ఎంపీ ఎన్నికల్లో అన్ని సీట్లను బీజేపీనే గెలుస్తుందని పేర్కొన్నారు.  

కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి..

కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.  దేశవ్యాప్తంగా రైతుల పెట్టుబడికి, ఎరువులకు ఎన్నో రకాల సబ్సిడీలను బీజేపీ సర్కారు అందజేస్తున్నదని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్​తో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు. 500 ఏండ్ల హిందువుల ఆకాంక్షను నెరవేరుస్తూ భవ్య రామాలయ నిర్మాణాన్ని మోదీ పూర్తి చేశారని ప్రశంసించారు. కాశ్మీర్​లో ఆర్టికల్​370ని రద్దు చేసి ఆ ప్రాంతాన్ని భారత్​లో కలిపిన ఘనత మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం లేదని.. బీఆర్ఎస్​కు భవిష్యత్తే లేదని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్వాయి హరీశ్​బాబు, మోహన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.