హైదరాబాద్, వెలుగు: అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఆఫీసర్లు అలసత్వం వహిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. గ్రామాల్లో అపారమైన సహజ, మానవ వనరులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగిస్తే గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల పరిధిలో 1.35 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నా.. గ్రామాల్లో ఆశించిన మార్పు రాకపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెరువును కాపాడుకుంటే ఊరిని కాపాడుకున్నట్టేనని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట ఉండాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం భూగర్భ జలాల పెంపొందించడమే లక్ష్యంగా ‘జలసిరి’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
