10 రోజుల్లో లష్కర్ ​బోనాలు..పనులు పూర్తయ్యేదెన్నడు..

10 రోజుల్లో లష్కర్ ​బోనాలు..పనులు పూర్తయ్యేదెన్నడు..

సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల17 నుంచి లష్కర్ బోనాలు మొదలుకానుండగా.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్ల పనులు మొదలు పెట్టి నెలరోజులు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. కొత్తవి వేసేందుకు టెంపుల్​కు వెళ్లే దారులను తవ్విపోశారు. కాగా ఇప్పటివరకు ఒకవైపు మాత్రమే సీసీ రోడ్డు వేశారు. దీనికి సంబంధించి ఇంకా క్యూరింగ్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే కానీ మరో వైపు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చాన్స్​లేదు. ఎక్కడికక్కడ తవ్వడంతో చిన్న వానకే ఆలయం చుట్టూ బురదమయం అవుతోంది. ఇటుగా నడిచేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు.10 రోజుల్లో బోనాలు ఉండడంతో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. ఏటా ఆషాఢ మాసంలో ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు లక్షల్లో భక్తులు వస్తారని, ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలను అందంగా తీర్చిదిద్ది.. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కానీ ఆ దిశగా పనులు జరగడం లేదు. 

‘మహంకాళి’కి తొలి బోనం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాలను ఘనంగా నిర్వహించేలా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర, 24న హైదరాబాద్ బోనాలు మొదలవుతాయని చెప్పారు. గతంలో అంబారీ ఊరేగింపు ఖర్చును ఆయా దేవాలయాలే భరించేవని, ప్రస్తు తం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్​ఇన్​చార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు.