అర్చకులకు 6 నెలలుగా జీతాల్లేవు : దేవీ ప్రసాద్

అర్చకులకు 6 నెలలుగా జీతాల్లేవు : దేవీ ప్రసాద్

హైదరాబాద్, వెలుగు: ధూపదీప నైవేద్యం కింద పూజారులకు ఇచ్చే వేతనాలను ఆరు నెలలుగా ఇవ్వడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని బీఆర్‌‌‌‌ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఒకటో తేదీ నాటికి అందరికీ వేతనాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ సర్కార్, ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 

మంగళవారం హైదరాబాద్‌‌లోని పార్టీ ఆఫీస్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రంథాలయాలలో పని చేసే ఉద్యోగులకు కూడా ఇంకా జీతాలు రాలేదన్నారు.  ఓవర్సీస్ స్కాలర్ షిప్ రావడం లేదని, ఇప్పటికే మంజూరు అయిన వాటిని కూడా నిలిపేశారని చెప్పారు. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం చాలా మందిని రెగ్యులరైజ్ చేసిందని, ఇంకా కొంత మందిని చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జీతాల కోసం చలో సెక్రటేరియెట్ చేపట్టిన అర్చకులను అరెస్టు చేశారని, ఇదేనా ప్రజా పాలన అని దేవీ ప్రసాద్ నిలదీశారు.