భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రాములోరి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిచిపోయిన నిత్య కల్యాణాలు తిరిగి ప్రారంభం కావడంతో 112 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూశారు. గాలిగోపురం, సుదర్శన గోపురం వైపు ఉన్న క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో మూలవరులైన సీతారామచంద్రస్వామిని బంగారు కవచాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వర్ణ కవచధారి రామయ్యను దర్శించుకుని భక్తులు ఆనందభరితులయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీ అష్టోత్తర పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బేడా మండపంలో జరిగిన నిత్య కల్యాణంలో విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్ర–బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహించి మంత్రపుష్పంతో కార్యక్రమాన్ని ముగించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం సీతారామయ్యకు సంధ్యాహారతి సమర్పించారు.
