సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించారు. కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుంచి నిర్వహించిన రోడ్డు భద్రతా ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ‘అరైవ్ - అలైవ్’ అవగాహన సదస్సులో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 200 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కొన్నేండ్లుగా జరిగిన ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ, 45 బ్లాక్ స్పాట్‌లను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

