కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ప్రారంభించిన డీజీపీ

కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్: ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్, పెట్రోలింగ్ సిస్టమ్ను సోమవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ప్రజలకు భద్రత కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కు తలమానిమైన కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రజల భద్రత కోసం 67 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న ఆయన... ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామని తెలిపారు. దుర్గం చెరువుకు వచ్చే విజిటర్స్ భద్రత కోసం ఎలక్ట్రికల్ వెహికిల్స్, బోటింగ్ ఏర్పాటుతో పాటు లేక్ పోలీసులను కూడా నియమించామని వెల్లడించారు. దుర్గం చెరువు పరిసరాల్లో ఐటీ కంపెనీలు ఉండటంతో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారని... అందుకోసం ఐటీ ఏరియాల్లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేశామని పేర్కొన్నారు.