వేములవాడ/చందుర్తి, వెలుగు : తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైందని, ఇక ఏకే 47తో పనిలేదని డీజీపీ బి.శివధర్‌రెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గీతేతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామన్నారు.
ప్రజలు కేంద్రంగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. హత్యలు, ఇతర కారణాలతో జరుగుతున్న మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పారు. వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతకుముందు వేములవాడలోని భీమేశ్వరస్వామి ఆలయంలో డీజీపీ శివధర్‌రెడ్డి ప్రత్యేక పూజల చేశారు.
ఆయనకు అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం డీజీపీకి ఆశీర్వచనం చేసి, స్వామి వారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఫొటో అందజేశారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాబాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్‌కుమార్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పోలీసుల సేవలు ఎంతో కీలకం : విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ప్రజలను కాపాడడంలో పోలీసుల సేవలు ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ పరిరక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సిరిసిల్లలో ఇటీవలే డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభించామని చెప్పారు. రూ.150 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయని, మూడో బ్రిడ్జి పనులు సైతం చేయిస్తున్నామని చెప్పారు.

