బషీర్బాగ్, వెలుగు: యువత ఎప్పుడూ ఒకే స్థాయికి పరిమితం కాకుండా నిరంతరం ఎదుగుదల కోసం కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆధునిక సమాజంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉండాలని సూచించారు. నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట రామరెడ్డి ఉమెన్స్ కాలేజి వార్షికోత్సవ వేడుకలకు గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారాయణగూడ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తన సోదరి ఇదే కాలేజీలో చదివిందని, తాను కూడా సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో విద్యనభ్యసించానని తెలిపారు. అనంతరం హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులు అందజేశారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, ఇతర పోటీల విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ట్రోఫీలు ప్రదానం చేశారు. సభకు ప్రిన్సిపాల్ డాక్టర్ జె. అచ్యుత దేవి అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపాల్ కె. సింధూరి పాల్గొన్నారు.
