- బతుకు తోవ చూపిస్తున్నరు
చదువుకున్న అమ్మాయిలకు మంచి జాబ్ దొరుకుతుంది. మరి, ఏమంత చదువుకోని అమ్మాయిలు, ఎవరి అండా లేని ఆడవాళ్ల పరిస్థితి ఏంటి. అలాంటి వాళ్ల భుజం తట్టి, మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తోంది ప్రసన్న దొమ్ము. ‘ధైర్య’ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆడవాళ్లకు ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించడమే కాకుండా, జాబ్స్ కూడా ఇప్పిస్తోంది. తన ఆలోచనతో ఎంతో మార్పు తెస్తున్న ఈ హైదరాబాదీ ‘లైఫ్’తో పంచుకున్న ముచ్చట్లివి...
ఒక ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ‘ధైర్య’ ఫౌండేషన్ స్టార్ట్ చేయలేదు. ఒక స్టార్టప్ పెట్టాలి, పేద ఆడవాళ్లకు హెల్ప్ చేయాలని నాకెప్పటినుంచో ఉంది. ఏది చేయాలనేది డిసైడ్ అవ్వడానికి టైం పట్టింది అంతే.
మా ఎక్స్‌పీరియెన్స్‌తో...
నా చదువంతా హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్ తరువాత ఎంబీఏ చేశాను. ఐటీ, మేనేజ్మెంట్, ఫుడ్.. ఇలా చాలా రంగాల్లో పదిహేనేళ్ల జాబ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఆ అనుభవంతో ఏదైనా మార్పు తెచ్చే పని చేయాలనుకున్నా. నా లాస్ట్ జాబ్ ప్రియా ఫుడ్స్‌లో. అక్కడే నిఖత్ పరిచయమైంది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అప్పటికే పేద కుటుంబాలు, మురికివాడల్లో ఉండే కుటుంబాలకు చెందిన అమ్మాయిలతో కలిసి పనిచేస్తోంది నిఖత్. అందుకే తనకు ఆ అమ్మాయిలు పడే బాధలు తెలుసు. చదువుకోని అమ్మాయిలు, ఎవరి సాయం లేని ఆడవాళ్లు ఇళ్లలో అంట్లు తోమడం లేదా సేల్స్‌గర్ల్స్ లాంటి పనులు చేస్తుంటారు. వాళ్లకు బైక్, ఆటో, కారు డ్రైవింగ్‌లో ట్రైనింగ్ ఇస్తే మంచి జాబ్ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటారు అనిపించింది. ఈ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసేందుకు మా పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఒక కారణం. ఎప్పుడైనా లేట్‌నైట్ ఆఫీస్, ఎయిర్పోర్ట్ నుంచి రావాలన్నా, మగవాళ్లు నడిపే క్యాబ్ ఎక్కితే సేఫ్ అనిపించేది కాదు. అలాగే, మా ఫ్రెండ్స్‌కి ఎదురైన అనుభవాలు చూశాక ఆడవాళ్లకు డ్రైవింగ్ నేర్పించాలి అనుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు విమెన్ డ్రైవర్స్ అవసరం చాలా ఉంది. అందుకే ఇద్దరం కలిసి2019 సెప్టెంబర్‌లో ‘ధైర్య’ ఫౌండేషన్ మొదలుపెట్టాం.
కరెక్ట్ కాదనిపించింది
అయితే డ్రైవింగ్ నేర్పించి, మా దగ్గరే పనిచేయాలని కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. డ్రైవింగ్ వచ్చిన ఆడవాళ్లకు జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొందరు పేరెంట్స్ తమ పిల్లలను స్కూల్లో డ్రాప్ చేసేందుకు విమెన్ ఆటో డ్రైవర్స్ కావాలని అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో నిత్యావసరాలు, ఫుడ్... హోమ్ డెలివరీలు ఎక్కువయ్యాయి. విమెన్ డ్రైవర్స్‌కు ఇప్పడు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో 15మందికి పైగా డెలివరీ పర్సన్‌గా చేస్తున్నారు. వాళ్లు నెలకు పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదిస్తూ, హ్యాపీగా ఉన్నారు. మా ఉద్దేశం కూడా అదే. ‘ధైర్య’ పేరు క్యాజువల్‌గా పెట్టలేదు. మన సొసైటీలో ఆడవాళ్లపై చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరికైతే లైఫ్‌లో ఏదైనా సాధించాలనే కోరిక ఉండి, సపోర్ట్ ఉండదో వాళ్లకు కొత్త దారి చూపిస్తున్నాం.
ట్రైనింగ్ ఇలా..
హైదరాబాద్‌లో చాలా ఎన్జీవోలు ఉన్నాయి. వాళ్లతో కలిసి వెళ్లి, మురికివాడల్లో ఉండే ఆడవాళ్లతో మాట్లాడతాం. ‘మీకు డ్రైవింగ్ నేర్పించి, జాబ్ ఇప్పిస్తాం’ అని వాళ్లకు అర్థమయ్యేలా చెబుతాం. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లనే సెలక్ట్ చేసి, ఏడు వారాలు ట్రైనింగ్ ఇస్తాం. అందరూ ట్రైనింగ్ కోసం బంజారాహిల్స్‌లోని మా ఆఫీస్‌కు రాలేరు. అందుకే వాళ్లు ఉండే కాలనీల్లోని కమ్యూనిటీ గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్పిస్తాం. డ్రైవింగ్ క్లాసుల్లో టైర్ పంక్చర్ అయితే మార్చుకోవడం, గూగుల్ మ్యాప్ వాడటం వంటి విషయాలన్నీ చెబుతాం. ఆ తరువాత వాళ్లకు పర్మినెంట్ లైసెన్స్ ఇప్పిస్తాం. మేము ‘ధైర్య’ను స్టార్ట్ చేసిన 4 నెలల్లోనే నలుగురు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఇప్పించాం. మా ప్రొగ్రామ్ మంచిగా ముందుకు వెళ్తున్న టైంలోనే కరోనా మొదలైంది.
ఇ–బైక్‌లు ఇప్పిస్తున్నాం
కరోనా, లాక్డౌన్ టైంలో ఆటోలు బంద్ అయ్యాయి. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అప్పుడే ఆ అమ్మాయిలకు బైక్ నడపడం నేర్పించాం.
అయితే కరోనా వల్ల ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది. అందరికీ సొంత బైకులు ఉండవు కదా! అలాంటి వాళ్లకు ఎలక్ట్రిక్, బ్యాటరీ బైకులను రెంటుకు ఇప్పిస్తున్నాం. ఇప్పడు హోమ్ డెలివరీలు ఎక్కువయ్యాయి. ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా విమెన్ డ్రైవర్స్‌ను అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు మంచి శాలరీ వస్తోంది. ఇప్పుడు వాళ్ల జీవితాల్లో నవ్వు చూస్తున్నాం. ఈ రెండేళ్ల జర్నీలో ఇప్పటి వరకైతే చాలా
శాటిస్ఫాక్షన్ ఉంది. జీతం వచ్చే జాబ్ కాకుండా సమాజంలో ఎంతో కొంత మార్పు తెస్తున్నామనే ఫీలింగ్ చాలా తృప్తిని ఇస్తోంది. ఈ జర్నీలో
వి–హబ్ వాళ్లు మాకు చాలా సాయం చేశారు.
డ్రైవింగ్ నేర్పిస్తా
ప్రసన్న, నేను ఒకేలా ఆలోచించే వాళ్లం. పేద అమ్మాయిలకు ఆర్థికంగా భరోసా ఇచ్చే పని చేయాలని ఇద్దరం అనుకునే వాళ్లం. అలా ‘ధైర్య’ మొదలుపెట్టాం. నేను గ్రౌండ్‌కు వెళ్లి అమ్మాయిలకు ఆటో, బైక్, కారు నడపడం నేర్పిస్తాను. ప్రసన్న ‘వి–హబ్’లో ఉండి ఫుడ్ డెలివరీ సంస్థలతో మాట్లాడడం వంటివి చూసుకుంటుంది.
నిఖత్, కో- ఫౌండర్, ధైర్య
రూరల్ ఏరియాల్లో కూడా..
సంవత్సరానికి కనీసం 500 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనేది మా టార్గెట్. సొసైటీలో మార్పు రావాలంటే అంత మంది రావాలి. ఒకరిద్దరితో మార్పు సాధ్యం కాదు. అందుకే ఏడాదికేడాది ట్రైనింగ్ తీసుకునే వాళ్ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో విమెన్ డ్రైవర్స్‌కు చాలా డిమాండ్ ఉంది. అయితే, ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రూరల్ ఏరియాస్‌లో కూడా మా సేవలు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి డెవలపింగ్ సిటీల్లో కూడా ‘ధైర్య’ సేవలు అందించాలి అనుకుంటున్నాం.
- ప్రసన్న దొమ్ము, ఫౌండర్, ధైర్య
::: సంతోష్ బొందుగుల
