యాసంగి లోన్లకు ‘ధరణి’ కష్టాలు

యాసంగి లోన్లకు ‘ధరణి’ కష్టాలు

సీసీఎల్ఏ వెబ్ సైట్ లో మాయమైన వన్ బీ, పహాణీలు

అవి చూపితే తప్ప లోన్లు ఇవ్వమంటున్న బ్యాంకర్లు

కొత్త ధరణిలోనూ ఈ వివరాలు ఉండట్లే

మీ సేవా సెంటర్లు, తహసీల్దార్ల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ధరణి పోర్టల్​ వల్ల రోజుకో కొత్త సమస్య వస్తోంది. ఓవైపు మ్యుటేషన్లు కాని భూములు డబుల్​ రిజిస్ట్రేషన్లు అవుతుండగా, మరోవైపు యాసంగి లోన్ల కోసం వెళ్తున్న రైతులను బ్యాంకర్లు తిప్పి పంపుతున్నారు. ఈ నెల 2 నుంచి ధరణి పోర్టల్​అందుబాటులోకి వచ్చాక, సీసీఎల్ఏ వెబ్ సైట్​లో ఇన్నాళ్లూ పబ్లిక్​డొమైన్​లో ఉన్న ల్యాండ్​ వివరాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో అగ్రికల్చర్​ల్యాండ్స్​కు సంబంధించి వన్ బీ, పహణీ ఆన్​లైన్​లో కనిపించడం లేదు. వాటిని మాన్యువల్​గా చూపితే తప్ప లోన్లు ఇచ్చేందుకు రూల్స్​ ఒప్పుకోవని బ్యాంకర్లు అంటున్నారు.  దీంతో రైతులు మీ సేవా సెంటర్లు, తహసీల్దార్​ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు.

వన్​బీ, పహాణీల కోసం రైతుల పాట్లు

అధికవర్షాలు, చీడపీడల కారణంగా ఈ వానాకాలం రైతులకు కలిసిరాలేదు. ఈసారి తీవ్ర పంట నష్టాలు మూటగట్టుకున్న అన్నదాతలు యాసంగి లోన్ల కోసం బ్యాంకులకు వెళ్తున్నారు. గతంలో పట్టాదారు పాస్​బుక్​తీసుకెళ్తే దాని ఆధారంగా బ్యాంకర్లు ఆన్​లైన్​లో వన్ బీ, పహాణీ చెక్​చేసుకునేవారు. ఇందుకోసం బ్యాంకు మేనేజర్లకు అప్పట్లో లాగిన్​ఐడీ, పాస్​వర్డ్​కూడా ఇచ్చారు. వివరాలన్నీ ఓకే అనుకున్నాకే రైతులకు లోన్స్​మంజూరు చేసేవారు. కానీ ఈసారి కొత్త ధరణి పోర్టల్ వచ్చాక సీసీఎల్ఏ వెబ్ సైట్ లో ఇన్నాళ్లూ పబ్లిక్​డొమైన్​లో ఉన్న ల్యాండ్​డాటాను తొలగించారు. కొత్త ధరణి పోర్టల్​కు సంబంధించి బ్యాంకర్లకు గతంలో మాదిరి లాగిన్​ఐడీ, పాస్​వర్డ్​ఇవ్వలేదు.  దీంతో బ్యాంకర్లు లోన్​కావాలని వచ్చినవారిని పాస్​బుక్​తో పాటు వన్​బీ, పహాణీ తీసుకురావాలని చెప్పి వెనక్కి పంపుతున్నారు.

మీ సేవా కేంద్రాల్లోనూ ఓపెన్​ కావట్లే..

గతంలో వన్​బీ, పహాణీలు కావాలంటే రైతులు మీ సేవాసెంటర్లకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ  సీసీఎల్ఏ వెబ్​సైట్​లో ల్యాండ్​ వివరాలు తొలగించడంతో వాళ్ల దగ్గర కూడా వన్​బీ, పహాణీ రావడం లేదు. తహసీల్దార్ ఆఫీసుల్లోనే ధరణి పోర్టల్ ఓపెన్​అవుతోందని తెలిసి  రైతులు అక్కడికి కూడా వెళ్తున్నారు. కానీ కొత్త ధరణి పోర్టల్ లో పట్టాదారు పేరు, తండ్రి పేరు, భూమి విస్తీర్ణం, మార్కెట్​వాల్యూ తప్ప ఇతరత్రా వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో వాళ్లు కూడా రైతులను వెనక్కి పంపుతున్నారు. వాస్తవానికి భూరికార్డుల ప్రక్షాళన తర్వాత ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తే రైతులు బ్యాంకు లోన్ల కోసం పాస్ బుక్​ కూడా తీసుకెళ్లాల్సిన పనిలేదని, అకౌంట్​నంబర్​ చెబితే బ్యాంకులు లోన్లు ఇస్తాయని సీఎం కేసీఆర్​ వివిధ సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ పట్టా పాస్ బుక్​తో పాటు వన్​బీ, పహాణీ ఉంటేనే లోన్లు మంజూరు చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు ఆగమవుతున్నారు.

వన్​బీ లేదని లోన్​ ఇస్తలేరు

మునగాల మండలం నేలమర్రిలో నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నాలుగేళ్ల నుంచి బ్యాంకులో లోన్ తీసుకుం టున్నా. ఈసారి యాసంగి లోన్​ కోసం వెళ్తే వన్ బీ, పహాణీ అడుగుతున్నారు. మీ సేవకు వెళ్తే ఓపెన్​కావడం లేదని అంటున్నరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వెంటనే వన్​బీ, పహాణీ ఇచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆ రెండూ లేకుండానే బ్యాంక్​లోన్​ వచ్చేలా చూడాలి. – సండ్రాల లింగయ్య, నేలమర్రి, మునగాల మండలం 

పోర్టల్​లో వన్​బీ, పహాణీ కనిపించట్లే

వీఆర్వో వ్యవస్థ రద్దు తరువాత ల్యాండ్ రికార్డు మేనేజ్ మెంట్ సిస్టమ్ పోర్టల్ లో వన్ బీ, పహాణీ కనిపించడం లేదు.  ప్రస్తుతానికి కొత్త ధరణి ద్వారా భూముల   క్రయ విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. రైతులకు వన్ బీలు, పహాణీలు ఇవ్వడం లేదు. ‑ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్, ఆత్మకూర్(ఎస్)

ధరణి పోర్టల్ లాగిన్ ఇవ్వలేదు

గతంలో ధరణి పోర్టల్​కు సంబంధించి మాకు లాగిన్​ ఐడీ, పాస్​వర్డ్​ ఇచ్చారు. దీంతో ఎవరైనా రైతులు లోన్​కోసం రాగానే వన్ బీ, పహాణీ చెక్​ చేసి శాంక్షన్​ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు  ధరణి పోర్టల్‌‌ ఐ‌‌డీ ఇవ్వకపోవడం తో రైతుల భూము ల వివరాలు తెలుసుకునే చాన్స్​లేకుండా పోయింది. దీంతో ఫిజికల్​గా వన్​బీ, పహాణీ చూడాల్సి వస్తోంది. అందువ ల్లే రైతులు వాటిని వెంట తెచ్చుకోవాలని చెబుతున్నాం.– జగదీశ్ ​చంద్రబోస్, లీడ్ బ్యాంక్ మేనేజర్, సూర్యాపేట.