
- తండ్రీకొడుకులను జైల్లో పెడ్తం
- కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తం
- ధరణి పేరుతో వేలాది ఎకరాలు దోచుకున్నరు
- అవన్నీ కేసీఆర్ బినామీలకే పోయినయని ఫైర్
హైదరాబాద్, వెలుగు:అధికారంలోకి రాగానే ధరణిని బరాబర్ రద్దు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల వేలాది ఎకరాల భూములు కేసీఆర్ బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్.. ఆ ఫ్యామిలీ మొత్తం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయం. వాళ్ల కుటుంబం మొత్తానికి అక్కడే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం. ఫ్యామిలీ అంతా కలిసి చర్లపల్లి జైలులో ఉండొచ్చు’’ అని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రేవంత్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గడీల పాలనను పునరుద్ధరించడానికే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారని రేవంత్ ఆరోపించారు.‘‘97% భూవివాదాలకు ధరణినే కారణం. రంగారెడ్డి, సంగారెడ్డి, మaల్కాజిగిరి జిల్లాల్లో భూ అవకతవకలు భారీగా జరిగాయి. హైదరాబాద్చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల నిజాం భూములను దోచుకున్నారు” అని ఆరోపించారు. ధరణిని ప్రారంభించిన మాడుచింతలపల్లిలోనే భూరికార్డులు లేకుండా పోయాయని చెప్పారు. ‘‘దోపిడీ కోసమే కేసీఆర్ ధరణిని వాడుకున్నారు. ఏడ్చి గోల పెట్టినా తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తాం. అక్రమాలకు పాల్పడిన అధికారులనూ ఊచలు లెక్కబెట్టిస్తాం” అని హెచ్చరించారు.
ఫిలిప్పీన్స్ కంపెనీ చేతుల్లో ధరణి..
ధరణిలో లేదా అధికారుల దగ్గర లేదంటే సీసీఎల్ఏ దగ్గర ఉండాల్సిన సమాచారమంతా ఫిలిప్పీన్స్‌కు చెందిన కంపెనీ చేతుల్లోకి పోయిందని రేవంత్ చెప్పారు. ‘‘ధరణి పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదు. దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ధరణి పోర్టల్ నిర్వహణను ఐఎల్అండ్ఎఫ్ఎస్అనే సంస్థకు రూ.150 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ ఆ కంపెనీ ఫిలిప్పీన్స్ కంపెనీకి రూ.1,350 కోట్లకు అమ్ముకుంది. దీని మధ్య ఉన్న గూడుపుఠానీ ఏందో ప్రభుత్వం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ధరణి రాకముందు రైతుబంధు రాలేదా? అని ప్రశ్నించారు.
ధరణి వల్లనే గెట్టు పంచాయితీలు, ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అలాంటి పోర్టల్‌ను రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకు దు:ఖం వస్తున్నదని ప్రశ్నించారు. ‘‘అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియెట్ నిర్మాణంలోనూ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. వందల కోట్లు దోచుకున్నారు” అని ఆరోపించారు. ‘‘నా పేరు పలికేందుకే కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్ నిజంగా ఉద్యమకారుడే అయితే నా పేరు తీయాలి” అని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలకు పంపిస్తారో ఎన్నికల్లో తేలుతుందన్నారు.
సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల..
రాష్ట్రంలో కేసీఆర్‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. కీలకమైన 5 అంశాలతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. అగ్రనాయకులతో సభలు నిర్వహిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసినోళ్లు.. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలుగా ఎదుగుతారని తెలిపారు. మోడీ, కేసీఆర్‌ను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేయాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ చర్చకు నేను రెడీ.. నువ్వు సిద్ధమా?
కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ చేసిన సవాల్ ను రేవంత్ స్వీకరించారు. ‘‘2004 నుంచి 2014 మధ్య జరిగినఅభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై కేటీఆర్, హరీశ్ సిద్ధమా?’’ అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ చేయనిదేదైనా బీఆర్ఎస్చేసి ఉంటే క్షమాపణ చెప్పేందుకూ తాను సిద్ధమన్నారు. తండ్రీ కొడుకులు నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతున్నారని విమర్శించారు. ‘‘మేంఅధికారంలోకి వస్తే కేసీఆర్‌లా రాష్ట్రాన్ని కొల్లగొట్టం. కేసీఆర్ కు బుద్ధి, జ్ఞానం ఉంటే ఉద్యమకారులను పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తాం. కేసీఆర్ రద్దయిన వెయ్యి నోటు లాంటోడు. మోడీ వెనక్కి తీసుకున్న రెండు వేల నోటు లాంటోడు. వెయ్యి నోటు చెల్లదు.. రెండు వేల నోటు అందుబాటులో ఉండదు” అని కామెంట్ చేశారు. తెలంగాణకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని, కర్నాటక ఫలితాలు పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.