- ఆస్తుల నమోదు అంత ఈజీ కాదంటున్న ఆఫీసర్లు
- హడావుడిగా చేస్తే కొత్త సమస్యలు వస్తాయని ఆందోళన
- అభ్యంతరాల కోసం తగినంత టైమ్ ఇవ్వాలన్న అభిప్రాయం
- ఉమ్మడి కుటుంబాల్లో కొత్త వివాదాలు తలెత్తే ప్రమాదం
- 5వ తేదీలోగానే కంప్లీట్ చేయాలని సర్కారు ఆదేశాలు!
హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ అంత ఈజీ కాదని.. దసరాలోపు వివరాలను అప్లోడ్ చేయడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు. కొందరు జనం అందుబాటులో ఉండటం లేదని.. ఇన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు, సర్కారు పథకాలు రాకుండా ఆపుతరా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్తున్నారు. సెల్ సిగ్నల్ సరిగా లేక, ఇంటర్నెట్ సరిగా రాక, సర్వర్ బిజీ రావడం వంటి వాటితో ఆన్లైన్లో వివరాల నమోదు కష్టమవుతోందని వాపోతున్నారు. రోజుకు 60, 70 ఇండ్ల డేటా ఎట్లా తీసుకోగలమని, హడావుడిగా వివరాల నమోదు వల్ల కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు. సర్కారు మాత్రం ఈ నెల 5వ తేదీకి వివరాల సేకరణ, ఆన్లైన్ అప్లోడ్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
అంతా ఆగమాగం
సర్కారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, టౌన్లలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మున్సిపల్, పంచాయతీ డిపార్ట్మెంట్ల స్టాఫ్.. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులు, ఆధార్, ఫోన్నంబర్, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఈ డేటా అంతటినీ సర్కారు రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించే ధరణి వెబ్‌సైట్‌లోకి మొత్తం వివరాలను ఎంటర్ చేయనున్నారు. పోర్టల్‌లో ఒకసారి వివరాలు నమోదు చేస్తే మార్పులు ఉండవని పేర్కొంది.
కుటుంబాల్లో కొత్త తగాదాలు
సర్కారు హడావుడి కారణంగా ఉమ్మడి కుటుంబాల్లో ఆస్తి తగాదాలు వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. నమోదు చేసిన ఆస్తుల వివరాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకునే చాన్స్ లేదు. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సోదరులు ఉంటే ఒకరికి తెలియకుండా మరొకరు తమ పేరున ఆస్తుల వివరాలు నమోదు చేయించుకునే చాన్స్ ఉందని చెప్తున్నారు.ఉమ్మడి కుటుంబాల ఆస్తుల వివరాలు సేకరించే సమయంలో ఇద్దరు ముగ్గురు ఆస్తిపై తమకే హక్కు ఉందని, తమ పేరుతోనే నమోదు చేయాలని గొడవలు చేస్తున్నారు.
దసరాకు పాక్షికంగానే..
క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే తీరును చూస్తుంటే.. దసరా పండుగ రోజున ప్రారంభించే ధరణి పోర్టల్ పాక్షిక సమాచారంతోనే అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. మొత్తం వివరాల నమోదుకు చాలానే టైం తీసుకుంటుందని అధికారవర్గాలే చెప్తున్నాయి. ప్రభుత్వ పెద్దల హడావుడితో రోజుకు 70 ఇండ్ల వివరాలు సేకరించాలని మున్సిపల్, పంచాయతీ స్టాఫ్ కు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టారు. స్టాఫ్ టైం తక్కువగా ఉండటంతో పూర్తి సమాచారాన్ని నమోదు చేయలేకపోతున్నారు. పనిపూర్తి చేయాలనే తొందరతో కొందరు తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమాచారంపై అభ్యంతరాలు, అనుమానాలు సరిచేసేందుకు కనీసం 15 రోజుల గడువివ్వాలని లేకుంటే ఇబ్బందులు వస్తాయని అధికారులు అంటున్నారు.
సర్వేకెళ్తే దొంగల్లా చూస్తున్నరు
నాన్ అగ్రికల్చర్ ఆస్తుల లెక్కింపు కోసం వెళ్తే.. ఊర్లలో ఎవరూ అందుబాటులో ఉండట్లేదు. అంతా వ్యవసాయ పనులకు పోతున్నరు. ఇండ్లకు వెళితే దొంగల్లా చూస్తున్నరు. 15, 20 ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నరు, ఆసరా పెన్షన్లు ఆపుతరా, ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తరా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నరు.
– మహబూబాబాద్ జిల్లాకు చెందిన పంచాయతీ సెక్రటరీ
టెక్నికల్ సమస్యలు ఉన్నయి
వివరాలన్నీ యాప్ లో అప్లోడ్ చేయాలంటే ఇబ్బంది అవుతోంది. ఉన్నతాధికారులు మధ్యాహ్నం కల్లా వివరాలు అందచేయాలని ఫోన్లు చేస్తున్నరు. ఊర్లలో సెల్ సిగ్నల్ ఉండటం లేదు. యాప్ సర్వర్ బిజీ అని వస్తోంది. ఓపెన్ కావడం లేదు. రోజుకు 70 ఇండ్ల ఆస్తులు లెక్కకట్టాలంటే అసాధ్యం. ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎలా చేస్తరు?
– రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పంచాయతీ సెక్రటరీ
5వ తేదీలోగానే సర్వే పూర్తి!
ఆస్తుల ఆన్లైన్ అప్డేషన్ ను ఈ నెల 5వ తేదీ వరకే పూర్తిచేయాలని పంచాయతీరాజ్అధికారులు గ్రామ కార్యదర్శులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ఆస్తుల జాబితాను 8న ఆయా పంచాయతీల్లో ప్రదర్శించాలని.. అభ్యంతరాలు ఉంటే 15 వరకు తీసుకోవాలని, 22వ తేదీలోపు తప్పులు సరిచేసి, 23న తుది జాబితా ప్రకటించాలని సూచించినట్టు సమాచారం. ప్రస్తుత ప్రక్రియను ప్రాపర్టీ అసెస్మెంట్ లేదా ఇండ్ల కొలతలు, ఇంటి పన్ను మదింపు వంటి పేర్లతో పిలవడం వల్ల తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఇకనుంచి ఇంగ్లిషులో ‘ఎన్టైటిల్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్’అని, తెలుగులో ‘ఆస్తుల నమోదు కార్యక్రమం’గా పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది.
